GHMC : లే అవుట్ క్రమబద్ధీకరణ తో జిహెచ్ఎంసికి 450 నుంచి 500 కోట్ల ఆదాయం

సర్వే నంబర్ల ఆధారంగా లే అవుట్‌/ప్లాట్‌ ఎక్కడున్నది గుర్తించి....

GHMC : లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్)లో భాగంగా ప్లాట్ల క్రమబద్ధీకరణకు పురపాలక శాఖ సవరణ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలనపై జీహెచ్‌ఎంసీ(GHMC) దృష్టి సారించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తుల పరిశీలనను ముమ్మరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీకి 1,06,920 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 40వేల దరఖాస్తులను ఇప్పటి వరకు పరిశీలించగా, 3 వేల వరకు తిరస్కరించారు.

GHMC Updates

28 వేల మంది దరఖాస్తుదారులకు మరిన్ని ధ్రువపత్రాలు సమర్పించాలని(షార్ట్‌ ఫాల్‌), కొంత మందికి రుసుము చెల్లించాలని సందేశం పంపారు. వాటి ద్వారా సంస్థకు సుమారు రూ.450 కోట్ల నుంచి రూ.500 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇది ఎంతో ఉపశమనంగా ఉంటుందని రెవెన్యూ విభాగం వర్గాలు చెబుతున్నాయి. సవరణ మార్గదర్శకాల ప్రకారం చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, ప్రభుత్వ స్థలాల పక్కనున్న లే అవుట్‌/ప్లాట్ల విషయంలో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరమే నిర్ణయం తీసుకోనున్నారు.

సర్వే నంబర్ల ఆధారంగా లే అవుట్‌/ప్లాట్‌ ఎక్కడున్నది గుర్తించి.. ఆ వివరాలు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ)కు పంపుతారు. అక్కడి నుంచి ఇరిగేషన్‌, రెవెన్యూ విభాగాలకు దరఖాస్తులు వెళ్తాయి. ఆయా విభాగాల అధికారుల సిఫారసు ఆధారంగా దరఖాస్తులను మునిసిపల్‌/ పంచాయతీరాజ్‌ విభాగాలు ప్రాసెస్‌ చేస్తాయి. ఆ రెండు కేటగిరీల్లో లేని భూములకు సంబంధించి ఆటోమేటిక్‌గా ఫీజు జనరేట్‌ అయి దరఖాస్తుదారుడికి సందేశం వెళ్తుంది. మార్చి 31వ తేదీలోపు 25 శాతం రాయితీతో రుసుము చెల్లించే అవకాశముంది. క్షేత్రస్థాయిలో యంత్రాంగం పరిశీలించిన అనంతరం క్రమబద్ధీకరణకు సంబంధించి ఫైనల్‌ ప్రొసిడింగ్స్‌ ఇవ్వనున్నారు. దరఖాస్తు తిరస్కరించిన పక్షంలో చెల్లించిన మొత్తం రుసుములో 10 శాతం మినహాయించుకొని, మిగతాది దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాలో తిరిగి జమ చేస్తారు.

Also Read : Canada Govt :కెనడా కొత్త వీసా రూల్స్ తో ఉక్కిరి బిక్కిరి లాడుతున్న విదేశీయులు

Leave A Reply

Your Email Id will not be published!