CM Revanth Reddy: భారత్‌ సమ్మిట్‌ అనుమతికోసం కేంద్ర మంత్రి జైశంకర్‌ కు సీఎం వినతి

భారత్‌ సమ్మిట్‌ అనుమతికోసం కేంద్ర మంత్రి జైశంకర్‌ కు సీఎం వినతి

CM Revanth Reddy : హైదరాబాద్‌ వేదికగా ఏప్రిల్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతున్న భారత్‌ సమ్మిట్‌ కు కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించాలని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ను(Minister S Jaishankar) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. గురువారం దిల్లీలో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ఖుర్షీద్, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌ లతో కలసి ఆయన కేంద్ర మంత్రి జైశంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు తెలంగాణ తల్లి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందిచారు.

CM Revanth Reddy Meet

అనంతరం కేంద్రమంత్రి జైశంకర్ తో సీఎం రేవంత్(CM Revanth Reddy) మాట్లాడుతూ… ఏప్రిల్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతున్న భారత్‌ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున దౌత్య, లాజిస్టిక్‌పరమైన సాయంతో దీని విజయవంతానికి సహకారం అందించాలని కోరారు. ఈ సమ్మిట్‌ ఆధారంగా రానున్న 25 సంవత్సరాల్లో తెలంగాణను సమున్నతంగా నిలిపేందుకు తమ ప్రభుత్వం దార్శనికపత్రం తయారు చేయబోతున్నట్లు జైశంకర్‌కు తెలిపారు. అలాగే ఈ ఏడాది హైదరాబాద్‌లో జరగనున్న మిస్‌వరల్డ్‌ పోటీలు, గ్లోబల్‌ డీప్‌ టెక్‌ సదస్సు, ఇండియా జాయ్‌ (యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, వినోద పరిశ్రమ) ఫెస్ట్‌ వివరాలను ఆయనకు రేవంత్‌ వివరించారు.

ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల నిర్వహణకు సహకారం అందించడం ద్వారా తెలంగాణ రైజింగ్‌ను ప్రోత్సహించాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి జైశంకర్‌ సానుకూలంగా స్పందించారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరంలో చేపట్టే కార్యక్రమాలకు తమ మంత్రిత్వశాఖ మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ విలేకర్లతో మాట్లాడుతూ… ‘‘మేలో హైదరాబాద్‌లో జరిగే మిస్‌వరల్డ్‌ పోటీలకు 100కుపైగా దేశాల నుంచి పోటీదారులు, విదేశీ ప్రతినిధులు, 3,000 మందికిపైగా మీడియా ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. ఈ పోటీకి సంబంధించిన కార్యక్రమాలు రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల్లో జరుగుతాయి. ఇందుకనువెiన చారిత్రక, పర్యాటక స్థలాలను ఎంపిక చేయడానికి త్వరలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే గుర్తింపు పొందిన స్థలాలను, కొత్త ప్రదేశాలను ఎంపికచేయడం పరంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై తగిన సిఫార్సులు చేస్తుంది’’అని పేర్కొన్నారు.

Also Read : MK Stalin: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై మళ్లీ విరుచుకుపడ్డ స్టాలిన్

Leave A Reply

Your Email Id will not be published!