Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 కు లోక్‌సభ ఆమోదం
చారిత్రాత్మక వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 కు లోక్‌సభ ఆమోదం
Waqf Bill : నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం తదితర పార్టీలు ఈ వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ… విపక్షాల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఈ వక్ఫ్ సవరణ బిల్లుపై(Waqf Bill) విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు… కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), మైనారిటీ వ్యవహారాల మంత్రి రిజిజు(Kiren Rijiju) దీటుగా జవాబిచ్చారు. అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2.15 గం.లు దాటే వరకూ చర్చ, ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోవడంతో ఎట్టకేటకు ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం లభించింది.
ఈ వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 కు ఎన్డీయే ప్రధాన భాగస్వామ్యపక్షాలైన టీడీపీ, జేడీ(యు), శివసేన (శిందే), లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్), జనసేన పార్టీలు మద్దతివ్వడంతో బీజేపీ(BJP)లో ఉత్సాహం ఇనుమడించింది. మరోవైపు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ముక్తకంఠంతో బిల్లును వ్యతిరేకించాయి. తీవ్ర నిరసనను ప్రకటించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన చేతిలోని బిల్లు ప్రతిని చింపివేశారు. వైసీపీ కూడా బిల్లుకు ప్రతికూలంగానే స్పందించింది. చర్చ, ఆమోదం కోసం వక్ఫ్ బిల్లు(Waqf Bill) గురువారం రాజ్యసభ ముందుకు రానుంది.
Waqf Bill – పార్లమెంటు భూమినీ వక్ఫ్ ఆస్తే అంటారు – కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
విపక్షాల నిరసనల మధ్య బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వక్ఫ్ బిల్లు(Waqf Bill)ను ప్రవేశపెడుతూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. ఈ బిల్లును తీసుకురాకపోతే… పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారని అన్నారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విస్తృత మంతనాలు జరిపి బిల్లులో పలు మార్పులు చేసిందని తెలిపారు. ముస్లింల మత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విస్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల నిర్వహణను సమర్థంగా, పారదర్శంగా కొనసాగించటానికి యత్నిస్తున్నామని తెలిపారు. ‘‘దేశంలో రైల్వేలు, రక్షణ శాఖ తర్వాత భారీగా ఆస్తులుంది వక్ఫ్ బోర్డుల నియంత్రణలోనే. రైల్వేలు, రక్షణ శాఖ ఆస్తులు దేశానికి చెందుతాయి. స్వభావ రీత్యా వక్ఫ్ ఆస్తులు ప్రైవేటువే. పేద ముస్లింలకు వీటిని ఉపయోగించాలి. నిరుపేదల ఉన్నతి కోసం మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రిజిస్టర్ చేసిన ఆస్తి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరు. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో ముస్లిం మహిళలు, పిల్లలకు వారి హక్కులు దక్కుతాయి’’ అని రిజిజు తెలిపారు.
వక్ఫ్ బిల్లు పేరును… యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ బిల్లుగా (ఉమీద్-యుఎంఈఈడీ)గా వ్యవహరించనున్నట్లు చెప్పారు. దీనితో పాటు ‘ముసల్మాన్ వక్ఫ్ (ఉపసంహరణ) బిల్లు-2024’ను కూడా లోక్‌సభలో చర్చ, ఆమోదం కోసం కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం విపక్షాల విమర్శలకు సమాధానమిస్తూ… ‘ప్రపంచంలో మైనారిటీలకు భారత్ కన్నా సురక్షితమైన దేశం మరొకటి లేదని తెలిపారు. తాను కూడా మైనారిటీ వర్గానికి చెందిన వాడినేనని పేర్కొన్నారు. వక్ఫ్ ట్రైబ్యునళ్ల వద్ద చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ బిల్లు చట్టరూపం దాల్చిన తర్వాత అవన్నీ సత్వరమే పరిష్కారమవుతాయని వివరించారు. అనంతరం విపక్ష సభ్యులు పట్టుపట్టడంతో సవరణలపై సభాపతి విడివిడిగా ఓటింగ్ నిర్వహించారు.
చట్టాన్ని అందరూ పాటించాలి – హోంమంత్రి
వక్ఫ్ బిల్లు ముస్లింలకు మేలు చేసేదే తప్ప… కీడు చేయదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బిల్లుకు వ్యతిరేకంగా మైనారిటీలను రెచ్చగొడుతున్న వారిని తీవ్రంగా హెచ్చరించారు. భారత ప్రభుత్వం, పార్లమెంటు తీసుకువస్తోన్న ఈ చట్టాన్ని అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులను అడ్డుపెట్టుకుని కొందరు రూ.వందల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్ ఉన్నది నిరుపేద ముస్లింల కోసమే కానీ దొంగల కోసం కాదని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా వక్ఫ్ చట్టానికి 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అన్యాయమైన సవరణలు చేసిందని విమర్శించారు. ఆ మార్పులు చేయకపోతే నేటి బిల్లు అవసరమయ్యేది కాదని పేర్కొన్నారు. అవినీతి కూపాలుగా మారిన వక్ఫ్ బోర్డుల్లో సమూల మార్పులు వస్తాయని బీజేపీ(BJP) ఎంపీ అనురాగ్ ఠాకుర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ 4డి దాడి
వక్ఫ్ బిల్లులోని పలు నిబంధనలను కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తూర్పారబడుతూ… కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగొయ్ పదునైన విమర్శలతో వాగ్బాణాలు సంధించారు. వక్ఫ్ బిల్లును రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంపై దాడిగా అభివర్ణించారు. రాజ్యాంగాన్ని నీరుగార్చడం (డైల్యూట్), మైనారిటీలను అప్రతిష్ఠ పాల్జేయడం (డిఫేమ్), సమాజాన్ని విభజించడం (డివైడ్), ముస్లింల హక్కులను హరించడం(డిసెన్‌ఫ్రాంఛైజ్) అనే నాలుగు (4డి) లక్ష్యాలతోనే బిల్లును తీసుకొచ్చారని విరుచుకుపడ్డారు. ‘‘వక్ఫ్ కు ఒక ముస్లిం తన ఆస్తిని విరాళంగా ఇవ్వాలంటే కనీసం అయిదేళ్లు ముస్లిం మతాన్ని ఆచరించినట్లు ధ్రువీకరణ సమర్పించాలనే నిబంధన అత్యంత దారుణం. ప్రభుత్వం నుంచి మత ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి రావడం నేడు దేశంలో మైనారిటీల దుస్థితికి నిదర్శనం. మత విశ్వాసాల అంశంలోకి ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటోంది?’’అని గొగొయ్ ప్రశ్నించారు.
వక్ఫ్ బిల్లుపై రాహుల్ గాంధీ ఆందోళన
వక్ఫ్ బిల్లుపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందిస్తూ… ముస్లింల వైయుక్తిక చట్టాల్లో జోక్యం చేసుకుని, వ్యక్తిగత ఆస్తుల్ని లాక్కోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ముస్లింలు లక్ష్యంగా ఆరెస్సెస్, భాజపా, వాటి మిత్రపక్షాలు చేస్తున్న దాడి ఇక్కడితో ఆగదని, భవిష్యత్తులో ఇతర మతాలవారిపైనా ఇలాగే చేస్తారని ‘ఎక్స్’ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
వక్ఫ్ బిల్లును కోర్టులో సవాలు చేస్తాం – అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు
వక్ఫ్ సవరణ బిల్లును కోర్టులో సవాలు చేస్తామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) ప్రకటించింది. ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ఏఐఎంపీఎల్‌బీ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఏఐఎంపీఎల్‌బీ సభ్యుడు ఎండీ అబీద్ మాట్లాడుతూ ఆ ‘నల్ల చట్టానికి’ వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు కూడా నిర్వహిస్తామన్నారు. ఈ బిల్లును ముస్లింల ఆస్తులు స్వాధీనం చేసుకునే ప్రయత్నంగా అభివర్ణించారు. ‘ఈ పోరాటంలో మనం ఓడిపోయామని భావించొద్దు. మనం ఇప్పుడే ప్రారంభించాం. ఇది దేశాన్ని కాపాడేందుకు చేస్తున్న పోరాటం. ఎందుకంటే భారతదేశ మౌలిక స్వభావానికే ముప్పుగా ప్రతిపాదిత చట్టం ఉంది’ అన్నారు. మనస్సాక్షిగల పౌరులందరూ ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. బిల్లును ఉపసంహరించుకునే వరకూ విశ్రమించేది లేదని తేల్చిచెప్పారు. రైతులు చేసినట్టే తామూ దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని, అవసరమైతే రోడ్లను దిగ్బంధిస్తామని ఏఐఎంపీఎల్‌బీ ఉపాధ్యక్షుడు అలీ మొహిసిన్ చెప్పారు.
Also Read : Konidela Nagababu: ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన నాగబాబు, సోము వీర్రాజు