CM Revanth Reddy: తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగావకాశాలు – సీఎం రేవంత్‌ రెడ్డి 

తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగావకాశాలు - సీఎం రేవంత్‌ రెడ్డి 

CM Revanth Reddy : తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌) జపాన్‌(Japan) లోని రెండు ప్రముఖ సంస్థలైన టెర్న్, రాజ్‌ గ్రూప్‌లతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలతో హెల్త్‌ కేర్‌ తో పాటు ఇతర రంగాల్లోనూ సహకారం విస్తరించనుంది. జపాన్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో అధికారుల బృందం శనివారం ఆ రెండు సంస్థల ప్రతినిధులతో తొలుత చర్చలు జరిపింది. తెలంగాణలో నైపుణ్యమున్న నిపుణులకు జపాన్‌ లోని అధిక డిమాండ్‌ ఉన్న రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

టెర్న్‌ గ్రూప్‌ టోక్యోలో(Tokyo) ప్రాంతీయ కార్యాలయంతో పాటు సాఫ్ట్‌వేర్, ఇంజినీరింగ్, స్కిల్డ్‌ వర్కర్‌ రంగాలలో అంతర్జాతీయ నియామకాలు చేపడుతోంది. టామ్‌కామ్‌తో ప్రస్తుతం పనిచేస్తున్న రాజ్‌ గ్రూప్‌ జపాన్‌లో పేరొందిన నర్సింగ్‌ కేర్‌ సంస్థ. రానున్న 1-2 ఏళ్లలో ఈ రెండు సంస్థలు దాదాపు 500 మందికి జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ఆరోగ్యరంగంలో 200, ఇంజినీరింగ్‌లో 100, ఆతిథ్యరంగంలో 100, నిర్మాణరంగంలో 100 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

CM Revanth Reddy – టోక్యోలో తెలుగు వెలుగుల పండగ సంబరాల కార్యక్రమంలో సీఎం రేవంత్‌

రానున్న రోజుల్లో అభివృద్ధిలో టోక్యో(Tokyo), న్యూయార్క్, లండన్‌ తో హైదరాబాద్ పోటీ పడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అమరావతి, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నగరాలు హైదరాబాద్ కు పోటీ కానేకాదని స్పష్టం చేశారు. సొంతూరు అభివృద్ధి చేసుకుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుందని, తెలంగాణ అభివృద్ధిలో జపాన్‌ లోని తెలంగాణ ప్రజలు పాలుపంచుకోవాలని కోరారు. అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరిస్తామన్నారు. జపాన్‌ లోని టోక్యో తరహాలో మూసీ నదీ తీర ప్రాజెక్టు అమలు చేస్తామంటే బీజేపీ, బీఆర్ఎస్ లు అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. జపాన్‌ పర్యటన సందర్భంగా శనివారం టోక్యోలో జపాన్‌ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు వెలుగుల పండగ సంబరాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

‘‘టోక్యోలో కాలుష్యం లేదు. కాలుష్యంతో ఢిల్లీలో సంస్థలు, కార్యాలయాలు మూతపడుతున్నాయి. ఢిల్లీ నగరమే సంక్షోభంలోకి వెళ్తోంది. హైదరాబాద్‌ ను ఆ స్థితికి రానీయం. అందుకే మూసీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం. నీళ్లు, సంస్కృతి ఉన్నచోట అభివృద్ధి, నాగరికత ఉంటుంది. నాలాల ఆక్రమణలు తొలగించాలి. చెరువుల్ని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. చెరువు మధ్యలో కట్టిన నిర్మాణాలను తొలగించకుంటే ప్రకృతి క్షమించదు. టోక్యో, అమెరికా, లండన్, సియోల్‌లలో రివర్‌ ఫ్రంట్‌లను పరిశీలించాం. నరేంద్రమోదీ గుజరాత్‌లో సబర్మతి, ఉత్తర్‌ప్రదేశ్‌ లో గంగానదీతీర ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఇప్పుడు ఢిల్లీలో యమునానదీ ప్రాజెక్టు చేపడతామంటున్నారు. కానీ హైదరాబాద్‌లో మూసీ నదీ తీర ప్రాజెక్టు చేస్తామంటే బీజేపీ, బీఆర్ఎస్ లు అడ్డుకుంటున్నాయి’’ అని సీఎం తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మూసీ ప్రక్షాళన, మెట్రోవిస్తరణ, రీజినల్‌ రింగ్‌ రోడ్, రేడియల్‌ రోడ్లు తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన ప్రాజెక్టులు. ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే ప్రగతి సాధించాం. తెలంగాణకు ఓడరేవు లేదు. అందుకే డ్రైపోర్టు ఏర్పాటు చేసి, మచిలీపట్నం నుంచి నేరుగా ప్రత్యేక జాతీయరహదారి, రైల్వేలైను నిర్మించడం ద్వారా రాష్ట్రంలో ఆటోమొబైల్‌ పరిశ్రమను విస్తరించాలి. సాగునీటి ప్రాజెక్టులే కాదు. పరిశ్రమలు పెరగాలి. పెట్టుబడులు రావాలి. ఉద్యోగాలు కల్పించాలి. త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నది అందుకే అని సీఎం రేవంత్ అన్నారు.

Also Read : Mother: కూల్‌ డ్రింక్‌ లో విషం కలిపి కుమార్తెను హతమార్చిన కన్నతల్లి

Leave A Reply

Your Email Id will not be published!