President Droupadi Murmu: ఎవరు సుప్రీం ? సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి 14 సూటి ప్రశ్నలు !

ఎవరు సుప్రీం ? సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి 14 సూటి ప్రశ్నలు !

President Droupadi Murmu : రాష్ట్ర శాసనసభలు పంపిన బిల్లుల ఆమోదానికి సంబంధించి గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితులు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతి, గవర్నర్లకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను సర్వోన్నత న్యాయస్థానం కట్టడి చేయడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu) ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాంగంలోని అధికరణం 143(1) కింద 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు సంధించి… న్యాయ సలహా కోరారు. ఏదైనా ప్రజాప్రాముఖ్యం ఉన్న అంశంపై 143(1) ప్రకారం సుప్రీంకోర్టు నుంచి న్యాయసలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు(Supreme Court).. రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

President Droupadi Murmu – అసలు సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమిటంటే ?

తమిళనాడు(Tamil Nadu) శాసనసభ ఆమోదించిన కొన్ని బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్‌ రవి ఆమోదించకుండా తన వద్దే చాలా కాలంగా పెండింగ్‌లో ఉంచడంతో డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌ మహాదేవన్‌ల ధర్మాసనం రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతిగానీ, గవర్నర్‌గానీ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలి. ఒకవేళ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపాలను కుంటే అందుకు తగు కారణాలనూ పేర్కొనాలి. గవర్నర్ల ఆలస్యపూరిత చర్య న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుంది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా న్యాయసమీక్ష అధికారం మాకు ఉంది అంటూ సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది.

అయితే ఆ తీర్పులో గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించిన వైనంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu) అసాధారణ రీతిలో స్పందించారు. బిల్లులకు ఆమోదముద్ర విషయంలో ఏకంగా గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించడమేంటని సుప్రీంకోర్టుపై(Supreme Court) రాష్ట్రపతి తాజాగా ప్రశ్నల వర్షం కురిపించారు. సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన అత్యంత కీలకమైన తీర్పుపై ఇలా రాష్ట్రపతి తీవ్ర, విస్తృతస్థాయిలో స్పందించడం, నేరుగా సుప్రీంకోర్టునే స్పందన కోరడం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు వెలువర్చిన తీర్పులపై సందేహాలు వెలిబుచ్చుతూ ప్రశ్నలు సంధించడం కూడా ఇదే తొలిసారి అని న్యాయరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. దీనితో బిల్లులపై రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కాలపరిమితిని విధించవచ్చా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని 143(1) అధికరణం ద్వారా తనకు దఖలు పడిన అసాధారణ అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి తాజాగా సుప్రీంకోర్టుకు పలు ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము… సుప్రీంకోర్టుకు మొత్తంగా 14 సూటి ప్రశ్నలు వేశారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంధించిన 14 ప్రశ్నలు ఇవే

1. రాజ్యాంగంలోని అధికరణం 200 కింద బిల్లుసమర్పించినప్పుడు గవర్నర్‌ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలేమిటి?

2. అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించే అవకాశం గవర్నర్‌కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలా?

3. అధికరణం 200 కింద తనకున్న రాజ్యాంగ విచక్షణాధికారాన్ని గవర్నర్‌ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా?

4. అధికరణం 200 కింద గవర్నర్‌ చర్యలపై న్యాయసమీక్షను రాజ్యాంగంలోని అధికరణం 361 పూర్తిగా నిషేధిస్తుందా?

5. రాజ్యాంగపరంగా నిర్ణీత కాలపరిమితి లేనప్పుడు, అధికరణం 200 ప్రకారం గవర్నర్‌కు ఉన్న అధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా కాలపరిమితులను విధించవచ్చా.. అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించవచ్చా?

6.అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణాధికారాన్ని వినియోగించుకోవడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా?

7. రాజ్యాంగం ప్రకారం నిర్ణీత కాలావధులు లేనప్పుడు అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతికి ఉన్న విచక్షణాధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా గడువులు విధించవచ్చా.. అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించవచ్చా?

8. రాజ్యాంగపరంగా రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించే సమయంలో అధికరణం 143 కింద సుప్రీంకోర్టు సలహా కోరాలా? ఆమోదం లేదా తిరస్కరణ కోసం గవర్నర్‌ బిల్లును పంపినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకోవాలా?

9. చట్టం అమల్లోకి రాకముందే అధికరణం 200, 201 కింద గవర్నర్, రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను కోర్టులు పరిశీలించడం సరైందేనా? ఒక బిల్లు చట్టంగా మారకముందు అందులోని అంశాలపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి న్యాయస్థానాలకు అనుమతి ఉందా?

10. రాష్ట్రపతి, గవర్నర్‌ రాజ్యాంగబద్ధ అధికారాలు, ఉత్తర్వులను ఏ రకంగానైనా రాజ్యాంగంలోని అధికరణం 142 భర్తీ చేస్తుందా?

11. రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం అధికరణం 200 కింద గవర్నర్‌ సమ్మతి లేకుండా అమల్లోకి రావొచ్చా?

12. అధికరణం 145(3) ప్రకారం, రాజ్యాంగ అంశాలతో ముడిపడి ఉన్న ప్రశ్నలు ఉన్న ప్రొసీడింగ్స్‌ ఏ ధర్మాసనం ముందుకు వచ్చినా దాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం తప్పనిసరి కాదా?

13. అధికరణం 142 కింద ఉన్న సుప్రీంకోర్టు అధికారాలు కేవలం ప్రొసీజర్‌ లాకే పరిమితమా? లేదా.. అధికరణం 142 కింద జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుత సబ్‌స్టాంటివ్‌ లా లేదా రాజ్యాంగంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నా చెల్లుబాటవుతాయా?

14. ఒక్క అధికరణం 131 కింద తప్ప కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికార పరిధులను రాజ్యాంగం నిషేధిస్తుందా?

రాష్ట్రపతి ప్రశ్నలను ఖండిస్తున్నాం -స్టాలిన్‌

రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కాపాడేందుకు చట్టపరమైన పోరాటంలో పాల్గొనాలని బీజేపీయేతర రాష్ట్రాలకు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ప్రశ్నలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు. రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 14 ప్రశ్నలను సంధించడంపై స్టాలిన్‌ స్పందిస్తూ తన ‘ఎక్స్‌’ పేజీలో ఓ పోస్టు చేశారు.

Also Read : Wing Commander Vyomika Singh: వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ పై మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!