హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన 34 నెలల్లో 12 లక్షల 40 వేలకు పైగా పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘భూ భారతి చట్టం’ అమలు, రైతులకు పట్టాదారు పాస్బుక్కుల పంపిణీ, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూ సర్వే, భూ సమస్యల పరిష్కారం , ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాల అమలు తీరుపై సమగ్రంగా ఆరా తీశారు. ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా అందేలా క్షేత్రస్థాయిలో అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం, స్వార్థపూరిత నిర్ణయాల వల్ల దశాబ్దాలుగా రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ‘భూ వివాదాలు లేని తెలంగాణ’ను నిర్మించాలనే సంకల్పంతో, రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం అని చెప్పారు. ‘భూ భారతి చట్టం’ ప్రకారం భూ సర్వేలు చేపట్టి, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తున్నాం అని తెలిపారు.
ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 14, 2025 నుండి ఇప్పటి వరకు 5,68,858 పాస్ బుక్కులను జారీ చేశామన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అదేవిధంగా, గత 34 నెలల్లో మొత్తం 12,40,366 పాస్‌బుక్కులను రైతులకు అందించాం అన్నారు. దీనివల్ల రైతులు బ్యాంకు రుణాలు పొందడానికి, ‘రైతు భరోసా’ వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందుకోవడానికి అవకాశం కలిగిందన్నారు. ఇదే తరహాలో, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూ సర్వేలు నిర్వహించి, భూములకు అసలైన యజమానులైన వారికి పాస్ బుక్కులను అందజేస్తాం అన్నారు మంత్రి.
