తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేసి, ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ ఆదేశించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తిరుచానూరులోని తోళప్ప గార్డెన్స్ లో జేఈవో (హెచ్ అండ్ ఈ) శ్రీ ప్రభల గోపీనాథ్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పుష్పాలంకరణ తదితర విభాగాల పనుల పురోగతిని జేఈవో సమీక్షించారు. ఆలయ పరిసరాలు, వాహన సేవలు జరిగే మార్గాలు, ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన వసతులు కల్పించాలని ఆదేశించారు జేఈవో. హోల్డింగ్ పాయింట్ల వద్ద అన్న ప్రసాదం, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. భక్తుల రాకపోకలు, క్యూలైన్లు, ఇతర సౌకర్యాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశాలు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి సూచనలు, సలహాల మేరకు బ్రహ్మోత్సవాల్లోని ప్రతి కార్యక్రమానికి సీనియర్ అధికారులను ఇన్ఛార్జ్లుగా నియమించినట్లు జేఈవో తెలిపారు. అధికారులు పరస్పర సమన్వయంతో, సమిష్టి కృషితో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.
ఈసారి తిరుచానూరు ఆలయంతో పాటు తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలోనూ విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ చేపడుతున్నట్లు జేఈవో వెల్లడించారు. నగర వాసులందరూ అమ్మ వారి బ్రహ్మోత్సవాలను తమ ఇంటి పండుగగా భావించి, భక్తిశ్రద్ధలతో పాల్గొని సహకరించాలని కోరారు. తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే పంచమి తీర్థం రోజున ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆవిర్భావ మహోత్సవానికి ప్రతీకగా నిర్వహించే పంచమితీర్థంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులందరూ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యక్షంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, వివిధ కారణాలతో రాలేని భక్తులు ఎస్వీబీసీ, సోషల్ మీడియా ద్వారా అందించే ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు జేఈవో.
