పోలవరం : పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అమలు చేస్తున్న భద్రతా చర్యలను అంచనా వేయడానికి, జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్డిఎస్ఎ) బృందం తొలిసారిగా ప్రాజెక్టును సందర్శించింది. ఈ బృందం ప్రాజెక్టులోని కీలక నిర్మాణాలను తనిఖీ చేసి, డ్యామ్ భద్రతా ఏర్పాట్లు మరియు పర్యవేక్షణ వ్యవస్థలను అంచనా వేయడానికి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ బృందంలో ఎన్డిఎస్ఎ దక్షిణ జోన్ డైరెక్టర్ గిరిధర్, డిప్యూటీ డైరెక్టర్ హేమాదిత్య ఉన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ పర్యటన జరిగింది. ప్రాజెక్టు సమావేశ మందిరంలో ఒక నమూనా మరియు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు ప్రాజెక్టు గురించి వివరించారు. సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. రామచంద్రారావు, ఇప్పటి వరకు పూర్తయిన పనులు, కొనసాగుతున్న నిర్మాణ స్థితితో సహా వివిధ భాగాల పురోగతిని వివరించారు.
తదనంతరం ఎన్డీఎస్ఏ బృందం స్పిల్‌వే, గ్యాప్-1, గ్యాప్-2 మరియు ఎర్త్-కమ్-రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ విభాగాలను తనిఖీ చేసింది. నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి తీసుకున్న భద్రతా చర్యల వివరాలను, అలాగే నిర్మాణాల పరిస్థితి మరియు పనితీరును పర్యవేక్షించడానికి వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన పరికరాల వివరాలను కోరింది. రామచంద్ర రావు పర్యవేక్షణ ఏర్పాట్లను , భద్రతా పరికరాల పనితీరును వివరించారు. ఈ పరికరాల ద్వారా సేకరిస్తున్న డేటా వివరాలను కూడా బృందం కోరింది. ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షించడం కోసం ఒక అధునాతన సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు బృందానికి తెలియ జేశారు. ఈ వ్యవస్థ సెన్సార్లు, మీటర్లు, వాల్వ్‌లు మరియు ఇతర పరికరాల నుండి రియల్-టైమ్ డేటాను సేకరించేలా రూపొందించ బడింది, ఇది ప్రాజెక్టులోని వివిధ భాగాలను నిరంతరం పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది.
ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ (EAP)ను ఐఐటి రూర్కీ సిద్ధం చేస్తోందని కూడా అధికారులు తెలిపారు. పూర్తి చేసిన ప్రణాళికను NDSAకు సమర్పిస్తామని వారు జోడించారు. దేశ వ్యాప్తంగా ఆనకట్టల భద్రతపై మార్గదర్శకాలు, సిఫార్సులు అందించడానికి, ఆనకట్టల భద్రతా చట్టం, 2021 ప్రకారం ఎన్డిఎస్ఎ ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు దీని తనిఖీలు పూర్తయిన డ్యామ్లపైనే దృష్టి సారించినప్పటికీ, ఇంకా నిర్మాణంలో ఉన్న పోలవరం డ్యామ్‌ను సందర్శించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
