అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33,647 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించారు.రెండో విడతలో 3,880 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 9,572 పోలింగ్ స్టేషన్ లొకేషన్ల పరిధిలో 40,569 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల భద్రత కోసం పోలింగ్ కేంద్రాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో 1,840 హైపర్ సెన్సిటివ్ కేంద్రాలకు 9,048 మంది పోలీసులను, 2,043 సెన్సిటివ్ కేంద్రాలకు 8,164 మంది సిబ్బందిని కేటాయించారు. మరో 5,689 సాధారణ పోలింగ్ కేంద్రాల్లోనూ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఎన్నికల బందోబస్తులో భాగంగా 1,810 రూట్ మొబైల్ బృందాలు, 737 స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, 278 చెక్‌పోస్టులు, ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు 94 ఏపీఎస్పీ ప్లటూన్లను రంగంలోకి దించారు. ఎన్నికల విధుల్లో 29 మంది ఎస్పీలు, 48 మంది అదనపు ఎస్పీలు, 140 మంది డీఎస్పీలు, 721 మంది సీఐలు, 1,507 మంది ఎస్ఐలు, 2,911 మంది ఏఎస్ఐలు, 22,301 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 5,990 మంది హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా, నిరంతర పెట్రోలింగ్, రూట్ మొబైల్ బృందాలతో పర్యవేక్షణ చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం శాంతిభద్రతల సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న ఐజీ ఎస్. హరికృష్ణ వెల్లడించారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు.
