శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్ పరిటాల శ్రీరామ్
వెంకటాపురంలో పరిటాల ఘాట్ వద్ద భావోద్వేగ నివాళులు
అమరావతి : శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. నూతన జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పీఠాన్ని దివంగత నేత పరిటాల రవీంద్ర వారసుడు, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అధిరోహించడంతో జిల్లాలో సరికొత్త పరిటాల శకం ప్రారంభమైంది. కూటమి పొత్తు ధర్మానికి అనుగుణంగా జనసేన పార్టీకి చెందిన గోరంట్ల జడ్పీటీసీ సునేత్ర వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రామగిరి మండలం వెంకటాపురంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పరిటాల శ్రీరామ్ ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఈ చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. అనంతరం తన తండ్రి, కీర్తిశేషులు పరిటాల రవీంద్ర ఘాట్ వద్దకు చేరుకుని భావోద్వేగంగా నివాళులర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. తదుపరి తమ ఇలవేల్పు శ్రీ యల్లమ్మ అమ్మవారి ఆలయంలో 201 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి వందలాది వాహనాలు, వేలాది మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య పుట్టపర్తికి బయలు దేరారు. మార్గమధ్యంలో అడుగడుగునా కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు.
ముందుగా పుట్టపర్తిలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్న శ్రీరామ్.. జిల్లా ఎన్నికల పరిశీలకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కందికుంట వెంకట ప్రసాద్, పల్లె సింధూర రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, కూటమి జడ్పీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం నేతలందరూ కలిసి మామిళ్ళకుంట క్రాస్‌లోని రెవెన్యూ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, శ్రేయోభిలాషుల సమక్షంలో నల్లచెరువు జడ్పీటీసీ సభ్యునిగా, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా ప్రథమ జడ్పీ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ పదవీ స్వీకార ప్రమాణం చేశారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యువతకు పెద్దపీట వేస్తూ, కొత్త రక్తం, కొత్త ఆలోచనలు పరిపాలనలోకి రావాలని యువనేత నారా లోకేష్ బలంగా నమ్మారని ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ అన్నారు. ఆ నమ్మకంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాకు తొలి జడ్పీ చైర్మన్‌గా ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించారన్నారు. గతంలో జిల్లాకు, పార్టీకి ఏ కష్టం వచ్చినా పరిటాల కుటుంబం ముందుండి అండగా నిలబడిందని.. నా తండ్రి పరిటాల రవి పార్టీని, సామాన్యులను నిలబెట్టడానికి కృషి చేశారన్నారు. మా అమ్మ పరిటాల సునీతమ్మ ఏ విధంగా పనిచేశారో.. వారి పేరు నిలబెడుతూ అంతకంటే గొప్పగా పని చేస్తానన్నారు. జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరి సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తాను. పార్టీ నాపై పెట్టిన బాధ్యతను, పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని శ్రీరామ్ అన్నారు.
