అమరావతి : బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్డీజీఎస్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ప్రఖర్ జైన్ తుపాను గండం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ ను అప్రమత్తం చేశారు. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయలని, ఆయా జిల్లాల కలెక్టర్లు సహాయక చర్యలు చేపట్టేలా సూచించాలని కోరారు. వాతావరణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై సమీక్షించారు. ఇవాళ సాయంత్రానికి వాయుగుండంగా ఆ తదుపరి తుఫానుగా బలపడే సూచనలు ఉన్నట్టు తెలిపారు సీఎంకు అధికారులు.
దీని పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉందన్నారు. ఆర్నబ్ తరహాలోనే ఈ తుఫాను ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు సహా వివిధ జిల్లాల్లో ప్రభావం ఉంటుందన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి.