హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ లో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్ ను సక్సెస్ చేయాలని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిని అధికారులు వివరించారు. సమ్మిట్ వేదిక, వివిధ హాల్స్, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతి ప్రతినిధికి ఒక లైజనింగ్ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతినిధులు విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే రిజిస్ట్రేషన్, పాస్‌ల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. సమ్మిట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగానే ప్రతినిధులకు అందజేయాలన్నారు. సదస్సుకు వచ్చే ప్రముఖులు, అన్ని రంగాల ప్రతినిధులకు వేదికలోకి ప్రవేశించినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. సమ్మిట్‌లో ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారితోపాటు భద్రతా అధికారిని నియమించాలని సీఎం అన్నారు. గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా సమ్మిట్‌కు ఆహ్వానించాలని సూచించారు. పెట్టుబడి ఒప్పందాలు చేసుకునేందుకు, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే కంపెనీల ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానాలు అందించాలని పేర్కొన్నారు. నవంబర్ 15 నాటికి సమ్మిట్ ఏర్పాట్ల పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గత ఏడాది తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌తో పోలిస్తే ఈసారి మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఒక ఎక్స్పో హాల్ ఉండగా ఈసారి ఆరు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తూ సమ్మిట్ కార్యక్రమాలను రూపొందించినట్లు చెప్పారు. సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్పో, క్లైమేట్ కాంక్లేవ్ల ఏర్పాట్లను వివరించారు . రక్షా ఎక్స్‌పోలో రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్షం, సైబర్ సెక్యూరిటీ రంగాలకు చెందిన ఆధునిక పరికరాలు, డ్రోన్లు, రోబోటిక్స్ ప్రదర్శించనున్నట్లు తెలిపారు. వైమానిక విన్యాసాలు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రక్షా ఎక్స్‌పోలో పాల్గొనేందుకు 575 సంస్థలను ఆహ్వానించగా ఇప్పటి వరకు 49 సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాలకు సంబంధించి ఇండియా జాయ్–2026 నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.స్టార్టప్‌ల కోసం ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేసి 136 స్టార్టప్‌ల ఆవిష్కరణలను ప్రదర్శించేలా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్‌లో భాగంగా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రజా మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను నవంబర్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి 60 కంపెనీల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాల పెవిలియన్‌లో ఆధునిక సాగు పద్ధతులు, వ్యవసాయ డ్రోన్లు, పాడి, మత్స్య, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని అన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, చేనేత, బతుకమ్మ, కాకతీయుల శిల్పకళతోపాటు రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను ప్రతిబింబించేలా ప్రత్యేక తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గ్లోబల్ సమ్మిట్‌లో పర్యాటక రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకునేలా ప్రదర్శించాలన్నారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ఎడ్యుకేషన్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ‘నర్సరీ నుంచి ఆక్స్ఫర్డ్ వరకు’ తెలంగాణ విద్యారంగం ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్‌లో చర్చలు జరగాలని సీఎం సూచించారు. మూడు రోజుల సమ్మిట్‌లో నాలుగు ప్రధాన హాళ్లలో 52 రంగాలవారీ సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. సమ్మిట్ నిర్వహణ కోసం 25 రంగాలవారీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు. దాదాపు 3,500 ఆహ్వానాలను పంపించారు. అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, వసతి, ప్రొటోకాల్, భద్రత, ప్రదర్శనల నిర్వహణ కోసం పది అధికారుల కమిటీలను ఏర్పాటు చేశారు.