శ్రీకాకుళం జిల్లా : అధికారిక హోదా కంటే ప్రజాస్వామ్య విలువలే గొప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆచరణలో చాటి చెప్పారు. గురువారం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సామాన్య ఓటరుగా క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఆయన సతీమణి కింజరాపు విజయమాధవి, కుమారుడు కింజరాపు కృష్ణమోహన్ నాయుడు కూడా ఓటు వేశారు. మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యం ఆశించకుండా ఇతర ఓటర్లతో కలిసి క్యూలైన్లో నిలబడి తన వంతు వచ్చే వరకు వేచి ఉండటం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడూ సమానమేనన్న సందేశాన్ని అచ్చెన్నాయుడు చాటి చెప్పారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడంలో సామాన్యుడైనా, ప్రజా ప్రతినిధైనా అందరూ సమానమేనని తన చర్యతో నిరూపించారు.
ఓటు వేసిన అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు. ఓటు అనేది కేవలం గుర్తుపై వేసే ముద్ర కాదు.. ప్రజల భవిష్యత్తును, సమాజ గతిని నిర్ణయించే శక్తిమంతమైన ఆయుధం అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాది. ప్రతి ఓటుకూ విలువ ఉందన్నారు . ఒక్క ఓటు కూడా ప్రజాతీర్పును మార్చగలదు అని పేర్కొన్నారు. ఈ విషయం చాలా సార్లు నిరూపితమైనట్లు తెలిపారు. ఇందుకు వాజ్ పేయి సర్కారు ఒకే ఒక్క ఓటుతో కేంద్ర సర్కార్ కూలి పోయిన విషయాన్ని ఈ సందర్బంగా మంత్రి గుర్తు చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగ లాంటివని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు. ఓటు వేయడం కేవలం రాజ్యాంగ బద్ధమైన హక్కు మాత్రమే కాదని, సమాజ భవిష్యత్తు పట్ల ప్రతి పౌరుడికీ ఉన్న బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, చైతన్య వంతమైన ఓటర్లే బలమైన ప్రజాస్వామ్యానికి పునాదులని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రతి పౌరుడూ బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు.