హైద‌రాబాద్ న‌గ‌రాభివృద్దిలో యాద‌వుల పాత్ర కీల‌కం

'శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం' అద్భుతమ‌ని సీఎం కితాబు

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. యాద‌వ సోద‌రులు నిర్వ‌హించిన‌ శ్రీ‌కృష్ణ స‌ద‌ర్ స‌మ్మేళనం అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు . హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పానికి యాదవ సోదరులు పూర్తి సహకారం అందించాలని కోరారు. మూసీ నది పునరుజ్జీవం, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ , ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వంటి ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్ మరింత అభివృద్ధి చెంది, దేశానికే ఆదర్శవంతమైన నగరంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన ‘శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యాదవ సోద‌రులు, సోద‌రీమ‌మ‌ణులంద‌రికీ సదర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవుల కృషి ఎంతో గొప్పదని ముఖ్యమంత్రి కొనియాడారు. ఉపాధి కోసం నగరానికి వచ్చిన వారందరినీ యాదవులు ఆదరించి, తమలో ఒకరిగా కలుపుకున్నారని ఆయన పేర్కొన్నారు. నగర అభివృద్ధి లోనూ, శాంతి భద్రతల పరిరక్షణ లోనూ యాదవులు పోషించిన కీలక పాత్రను సీఎం అభినందించారు. హైదరాబాద్ నగరం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా, అద్భుతంగా అభివృద్ధి చెందేలా కృషి చేయాలని యాదవ సోదరులకు పిలుపునిచ్చారు. యాదవుల ఆత్మ గౌరవాన్ని, హక్కులను కాపాడే విషయంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడటం తన బాధ్యత అని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం ‘సదర్ సమ్మేళనం’ను అధికారికంగా నిర్వహించలేదని గుర్తు చేసిన ముఖ్యమంత్రి, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాదవుల అభ్యర్థన మేరకు దీనిని ‘రాష్ట్ర పండుగ’గా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ఈ పండుగల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 5 కోట్ల నిధులను విడుదల చేసిందని ఆయన చెప్పారు. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో పాటు వివిధ ప్రాంతాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సదర్ పండుగకు మరింత శోభను చేకూర్చిందని పేర్కొన్నారు దేశంలోనే మొదటిసారిగా తాము కుల గణన చేపట్టి ఒక కొత్త ఒరవడిని సృష్టించామని తెలిపారు. ప్రతి సామాజిక వర్గానికి వారి జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వంలో యాదవులకు తగిన స్థానాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు.

ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పాలక మండలి (గవర్నింగ్ కౌన్సిల్) సభ్యురాలిగా నియమించడమే కాకుండా, యాదగిరిగుట్ట గోశాల బాధ్యతలను కూడా అప్ప‌గించామ‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!