అమరావతి : ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేలా కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల అంచనా కోసం రాష్ట్రంలో పర్యటించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ) ముఖ్యమంత్రిని కలిసింది. ఈనెల 2, 3 తేదీల్లో రెండు బృందాలుగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పర్యటించిన సభ్యులు తమ కరువు అధ్యయన వివరాలు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని తీర ప్రాంతం తుఫాన్ల సమస్యతో ఇబ్బందులు పడుతుంటే… మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో కారణంగా రాయలసీమ సహా ఇంకొన్ని ప్రాంతాలు తీవ్ర కరవుతో అల్లాడుతున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆ బృందానికి వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలు, రైతుల సమస్యలు, ప్రభుత్వం చేపడుతున్న ఉపశమన చర్యలపై స్పష్టత లభించిందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కంటే గణనీయంగా తక్కువ వర్షపాతం నమోదైందని, దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఐఎంసీటీ సభ్యులకు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, సాగునీటితో పాటు తాగునీరు, పశుగ్రాసం సమస్యలు కూడా తలెత్తాయని వివరించారు. అనంతపురం జిల్లాలో దేశంలోనే రెండో అత్యల్ప వర్షపాతం నమోదైన పరిస్థితిని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో 21 జిల్లాల్లో 412 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించామని, రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి వారం రోజుల్లో కరువు పరిస్థితులపై కేంద్రానికి నివేదిక కూడా సమర్పిస్తామని సీఎం చెప్పారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రకృతి వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంటుందని వివరించారు.
ఈ నేపథ్యంలో వీబీ జీ రామ్ జీ పథకం కింద కనీస పని దినాలను 200 రోజులకు పెంచి, వ్యవసాయ రంగానికి అవసరమైన పనులకు ఈ పథకాన్ని వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని కేంద్ర బృందాన్ని కోరారు. దీంతో రైతులకు మానవ వనరుల సమస్య తీరడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కరువు పరిస్థితుల వల్ల రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోతోందని, వ్యవసాయ రుణాల చెల్లింపులపై కూడా ప్రభావం పడుతోందని ముఖ్యమంత్రి వివరించారు. గతంలో రాయలసీమలో పది ఎకరాల భూమి ఉన్న రైతులకు సైతం కరువు పరిస్థితుల దృష్ట్యా రేషన్ కార్డులు అందించామని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అర్హులైన కరువు బాధిత కుటుంబాలకు డ్రాట్ కార్డులు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దీంతో కేంద్ర సహకారంతో నిత్యావసర సరుకుల ధరలు సబ్సిడీపై అందించే వీలుంటుందని చెప్పారు. అలాగే, రైతులకు రుణాల రీషెడ్యూలింగ్ వంటి ఉపశమన చర్యలు అందేలా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.