సంజు శాంస‌న్ చెల‌రేగినా భార‌త్ కు త‌ప్ప‌ని ఓట‌మి

భారీ ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా ఛేదించిన వెస్టిండీస్ టీం

రాంచీ : స్వ‌దేశంలో విండీస్ తో జ‌రుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా రాంచీ వేదిక‌గా జ‌రిగిన టి20 మ్యాచ్ లో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది వెస్టిండీస్. ఇరు జ‌ట్లు భారీ స్కోర్ ను న‌మోదు చేశాయి. తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ అద్భుతమైన సెంచ‌రీతో ఇండియాకు గ్రాండ్ విక్ట‌రీ ద‌క్కేలా చేశాడు. తాజాగా జ‌రిగిన రెండో టి20 మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ‌ను రేపింది. ఇరు జ‌ట్లు నువ్వా నేనా అని పోటీ ప‌డ్డాయి. రాంచీ మైదానంలో ఇరు జ‌ట్లు ప‌రుగుల వ‌ర‌ద‌ను పారించాయి. ఈ మ్యాచ్‌లో రోస్టన్ చేజ్ అత్యుత్తమ వెస్టిండీస్ బౌలర్‌గా నిలిచాడు. త‌ను 4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 24 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి కీల‌క‌మైన నాలుగు వికెట్లు తీశాడు. ఇదే క్ర‌మంలో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ సూప‌ర్ సెంచ‌రీతో ఆదుకున్నాడు. త‌న జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. భార‌త బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. అత్యంత బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ తో అల‌రించాడు.

కెప్టెన్ షాయ్ కేవ‌లం 45 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. 102 ర‌న్స్ చేశాడు. విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. జ‌ట్టును ముందుండి న‌డిపించాడు. దీనితో వెస్టిండీస్ జట్టు రికార్డు స్థాయి లక్ష్య ఛేదనను పూర్తి చేసింది. భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో పాటు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొమ్మిది సిక్సర్లు , ఆరు ఫోర్లతో అజేయంగా నిలిచిన హోప్‌కు 37 బంతుల్లో 84 పరుగులు చేసిన షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ అద్భుత సహకారం అందించారు. భారత్ నిర్దేశించిన 249/5 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే ఛేదించింది. ఇదిలా ఉండగా అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ తరపున ఓపెనర్ సంజు శాంసన్ 41 బంతుల్లో 82 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 43), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (18 బంతుల్లో 40) , తిలక్ వర్మ (18 బంతుల్లో 44) కూడా భారత్ భారీ స్కోరుకు తమ వంతు సహకారం అందించారు. అయినా జట్టును గెలిపించ లేక పోయారు.

Leave A Reply

Your Email Id will not be published!