జ‌ల ద్రోహానికి పాల్ప‌డిన సీఎం రేవంత్ రెడ్డి

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన హ‌రీష్ రావు

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హ‌రీష్ రావు. ఆయ‌న జ‌ల ద్రోహానికి పాల్ప‌డ్డారంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ సమావేశం మినిట్సే మరో సాక్ష్యం అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన అక్రమ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ప్రభుత్వం కనీసం ప్రస్తావించక పోవడం ఏపీకి వరంగా మారితే.. తెలంగాణకు శాపంగా పరిణమిస్తోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగు లొత్తుతున్న రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఉండదన్నారు హ‌రీష్ రావు.

నాగార్జునసాగర్ జలాలను తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి ఎందుకు ప్రశ్నించ లేదని ప్ర‌శ్నించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎందుకు గళమెత్త లేద‌ని నిల‌దీశారు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో గోదావరి జలాలను తరలించే బనకచర్ల ప్రాజెక్టుపై నిలదీయకుండా జలద్రోహం చేశార‌ని ఆరోపించారు. నేడు హైదరాబాద్ వేదికగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కృష్ణా జలాలను తరలించే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రశ్నించకుండా మరోసారి జలద్రోహానికి పాల్పడ్డారని అన్నారు హ‌రీష్ రావు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే రేవంత్ రెడ్డి వైఖరి మాత్రం మారడం లేదన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి లొంగిపోయి, ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సహకరిస్తుంటే తెలంగాణ ప్రయోజనాలకు రక్షణ ఎవరు క‌ల్పిస్తారంటూ ప్ర‌శ్నించారు.

Leave A Reply

Your Email Id will not be published!