శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా : భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా, భద్రాచలం ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన రాతి కట్టడాలతో పునర్నిర్మిస్తున్నాం అని అన్నారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా భద్రాచలంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయంలో చేపట్టిన పునరుద్ధరణ పనుల్లో భాగంగా, రాతి కట్టడాల నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్ , స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ సీతా రామచంద్ర స్వామిని దర్శించుకుని, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రజా ప్రభుత్వం రాబోయే గోదావరి పుష్కరాల నాటికి బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి తీరాన ఉన్న పవిత్ర క్షేత్రాలను అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంద‌ని చెప్పారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే వివిధ శాఖల ద్వారా రూ. 1,100 కోట్లకు పైగా నిధులను కేటాయించడం జ‌రిగింద‌న్నారు. భద్రాచలం ఆలయం మరో 200 ఏళ్ల పాటు సుస్థిరంగా ఉండేలా శాశ్వత కట్టడాల కోసం రూ. 300 కోట్లు కేటాయించామ‌ని తెలిపారు. అవసరమైతే మరిన్ని అదనపు నిధులను కూడా సమకూరుస్తాం అన్నారు. ఆలయ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని చెప్పారు.

శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆశీస్సులతో నిర్ణీత గడువులోగా ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం అని ప్ర‌క‌టంచారు. రాబోయే ముక్కోటి ఏకాదశి నాటికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రాద్రిని సిద్ధం చేయాలని, ఇందుకోసం వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అనంత‌రం భద్రాచలం సబ్-కలెక్టర్ కార్యాలయంలో ఆలయ అభివృద్ధి పనులు , గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

Leave A Reply

Your Email Id will not be published!