వెల్లింగ్టన్ : మ్యాచ్ అవార్డుగా వచ్చిన మొబైల్ ఫోన్‌ను గ్రౌండ్ స్టాఫ్ సభ్యురాలికి బహుకరించి తన ఉదారతను చాటుకునన్నాడు ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించినప్పటికీ భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ‘గేమ్ ఛేంజర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన కేఎల్ రాహుల్, తనకు బహుమతిగా వచ్చిన మొబైల్ ఫోన్‌ను గ్రౌండ్ స్టాఫ్ సభ్యురాలికి ఇచ్చి అందరి మనసులను గెలుచుకున్నారు. వెల్లింగ్‌టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రాహుల్ చూపిన ఈ ఉదారతపై అభిమానులు, భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రశంసలు కురిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను క్రీడా సంస్థ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ఎక్స్ వేదికగా పంచుకుంది. ‘గొప్ప ఆటగాడు.. అంతకంటే గొప్ప మనసు ఉన్న క్రికెటర్ అని పేర్కొంది. వీడియోలో ఆ గ్రౌండ్ స్టాఫ్ సభ్యురాలు రాహుల్ నుండి ఫోన్ అందుకున్న తర్వాత ఆశ్చర్యానికి, కృతజ్ఞతకు లోనవ్వడం కనిపించింది.
రాహుల్ తనకు బహుమతిగా వచ్చిన ఫోన్‌ను నాకు ఇచ్చేశారు. నేను నిజంగా ఆశ్చర్య పోయాను. ఆయన ఇంత దయ చూపడం చాలా గొప్ప విషయం, నేను అస్సలు ఊహించ లేదు అని ఆమె ఆ వీడియోలో చెప్పారు. రాహుల్ ఆమె వైపు చూస్తూ చిరునవ్వు చిందించగా, ఆమె తల ఊపి తన కృతజ్ఞతను తెలియ జేశారు. వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌ల, రాహుల్ అజేయంగా నిలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించడంతో ఆయనకు ‘గేమ్ ఛేంజర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ పద్ధతి ప్రకారం, భారత్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. 135 పరుగుల లక్ష్యఛేదనలో ఉన్న భారత్, 26 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసిన దశలో వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపి వేయాల్సి వచ్చింది.
ఈ సమయంలో భారత్ డీఎల్ఎస్ పద్ధతిలో నిర్ణయించిన లక్ష్యం కంటే నాలుగు పరుగులు ముందుండటంతో విజేతగా నిలిచింది. కష్టతరమైన పరిస్థితుల్లో ఏడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను ఆదుకోవడంలో రాహుల్ కీలక పాత్ర పోషించారు. తను 34 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఐదవ వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు .
