చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ మళ్లీ కెమెరా ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇది ఏదైనా చలన చిత్రం కోసం కాదు సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్, ఒక భారీ బడ్జెట్ ప్రభుత్వ ప్రకటనలో కనిపించనున్నారని దీనికి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రకటన చిత్రీకరణ కోసం విజయ్ రెండు రోజుల సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచార కార్యక్రమం ఉద్దేశ్యం, బడ్జెట్ , ఇతర వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. రాష్ట్ర ఉప ఎన్నికల తర్వాత ఈ చిత్రీకరణ జరిగే అవకాశం ఉంది.
గతంలోనే సినిమాలకు స్వస్తి పలికి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు విజయ్ ప్రకటించిన నేపథ్యంలో, ఆయన మళ్లీ కెమెరా ముందుకు రానుండటం అందరి దృష్టిని ఆకర్షించింది. తను నటించిన ‘జన నాయగన్’ చిత్రం ఆయన కెరీర్లో చివరి చిత్రమని ప్రకటించడంతో, తమిళ సినీ రంగంలో అగ్రనటుడిగా సుదీర్ఘ ప్రయాణం ముగిసినట్లు భావించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, విజయ్ ఇక సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆయన ఒక ప్రభుత్వ ప్రకటనలో కనిపించ నున్నారనే వార్త అభిమానుల్లో, సినీ పరిశ్రమ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది
విజయ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలిసి పని చేయనున్నారనే వార్త ఈ అంశానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చింది. గౌతమ్ మీనన్ ఇప్పటికే అనేక ప్రజాదరణ పొందిన తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ మాత్రం భిన్నమైనదిగా ఉండనుంది. ఈ ప్రభుత్వ ప్రకటనను విజయ్ మళ్లీ వాణిజ్య సినిమాల్లోకి తిరిగి వస్తున్నట్లుగా పొరబడకూడదు. ప్రస్తుతానికి ఆయన కేవలం ఒక ప్రభుత్వ ప్రచార కార్యక్రమం కోసం మాత్రమే ఇందులో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు.
