కీవీస్ తో జ‌రిగే 2వ టీ20 మ్యాచ్ కు ఇషాన్ కిష‌న్ దూరం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)

ముంబై : న్యూజిలాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ దూరం కానున్నాడు. ఈ విష‌యాన్ని బీసీసీఐ వెల్ల‌డించింది. సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌ల ఇషాన్ కిషన్ 5వ స్థానంలో బ్యాటింగ్‌కు రాగా, తిలక్ వర్మ 3వ స్థానంలో వచ్చారు. బీసీసీఐ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, ఇషాన్ కిషన్ కుడి కాలి గజ్జ భాగంలో స్వల్ప స్థాయి గాయం కారణంగా రెండో టీ20 మ్యాచ్‌కు అందుబాటులో ఉండరు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మొదటి టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగా ఆ మ్యాచ్‌లోనే ఇషాన్‌కు ఈ గాయమైంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పుల గురించి స్పందిస్తూ, బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ మాట్లాడుతూ, ఇషాన్ కిషన్ గజ్జ భాగంలో గాయంతో బాధపడుతున్నారని తెలిపారు. రెండో టీ20లో ఇషాన్ ఆడక పోవడంతో యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై చాలా ఊహాగానాలు వచ్చాయి; ఇషాన్‌కు గజ్జ భాగంలో గాయం ఉండటం వల్లే బ్యాటింగ్ క్రమంలో మార్పులు చేశాం అని కోటక్ విలేకరులతో అన్నారు. ఇషాన్ పూర్తిగా కోలుకోకపోతే – దీనిపై వైద్య బృందం నిర్ణయం తీసుకుంటుందని, ఆయన స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా జట్టులోకి రావచ్చు అన్నారు. అతను బలమైన అభ్యర్థుల్లో ఒక‌డు అని ఆయన పేర్కొన్నారు. మొదటి టీ20 మ్యాచ్‌లో, భారత్ 226 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది; నాలుగు వికెట్లు మిగిలి ఉండగానే మరో రెండు బంతులు మిగిలి ఉండగా విజయాన్ని అందుకుంది. అయితే ఇషాన్ కిషన్‌కు బదులుగా తిలక్ వర్మను మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

తిలక్ వర్మ 11 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేయగా ఇషాన్ కిషన్ కూడా తడబడ్డాడు; అతను మూడు బంతులు మాత్రమే ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. తిలక్ వర్మను మైఖేల్ బ్రేస్‌వెల్ అవుట్ చేయగా, ఇషాన్ కిషన్ వికెట్‌ను మిచెల్ సాంట్నర్ పడగొట్టాడు. ఐపీఎల్ మరియు అండర్-19 క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించిన సూర్యవంశీ ఇప్పుడు సీనియర్ జట్టులోకి వచ్చాడు. దీంతో అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు యువ సంచలనం సూర్యవంశీని ఎంచుకోవాలా లేక అనుభవజ్ఞుడైన సంజు శాంస‌న్ కు అవకాశం ఇవ్వాలా అనే విషయంలో భారత జట్టు ఎంపికలో సందిగ్ధత నెలకొంది.

Leave A Reply

Your Email Id will not be published!