భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు

టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి

తిరుమల : తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్న ప్రసాదాల పంపిణీకి అంతరాయం లేకుండా, క్యూలైన్లు బయటకు రాకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ మేరకు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు, వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించాలని, సాధ్యమైనంత వరకు క్యూ లైన్లు వెలుపలకు రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

వర్షాల కారణంగా అన్న ప్రసాదాల పంపిణీకి ఎక్కడా అంతరాయం కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో టార్పాలిన్లు ఏర్పాటు చేసి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించాలని సూచించారు. భక్తులు వసతి గదులు, కంపార్ట్‌మెంట్లలో సురక్షితంగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని విద్యుత్, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్లలో వర్షాల కారణంగా చిన్న చిన్న రాళ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని, డౌన్ ఘాట్, అప్ ఘాట్ రోడ్లలో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని స్ప‌ష్టం చేశారు ఏఈవో.

వర్షాల సమయంలో భక్తులు నడిచేటప్పుడు జారిపడి గాయపడే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి, అవసరమైన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. భక్తులందరూ సురక్షితంగా, సులభంగా శ్రీవారి దర్శనం చేసుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Leave A Reply

Your Email Id will not be published!