వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి ప‌నులు పూర్తి చేయాలి

ఆదేశించిన వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ

హైద‌రాబాద్ : వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రోడ్లు, భవనాల శాఖ , ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో అల్వాల్‌లోని టిమ్స్ , ఎల్బీ నగర్‌లోని టిమ్స్ , వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్ అండ్ బి, ఆరోగ్య శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఆసుపత్రిలోని ప్రతి అంతస్తుకు సంబంధించిన ఫ్లోర్ ప్లాన్‌ను మంత్రి పరిశీలించారు. మొదటగా అవుట్‌పేషెంట్ సేవలను ప్రారంభించాల్సి ఉన్నందున, రిజిస్ట్రేషన్ డెస్క్‌లు, ఓపీడీ కన్సల్టేషన్ గదులు, ఫార్మసీ, డయాగ్నోస్టిక్స్ ,ఇతర సంబంధిత సేవలకు అవసరమైన పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. అవుట్‌పేషెంట్ సేవలకు సంబంధించిన పనులన్నీ ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. అలాగే 6 ఆపరేషన్ థియేటర్లు కూడా సిద్ధంగా ఉంటాయని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన రోగిని మరే ఇతర ఆసుపత్రికి రిఫర్ చేయాల్సిన అవసరం లేకుండా, అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే అందేలా ఏర్పాట్లు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వం నియమించిన వైద్యుల బృందం వరంగల్ ఆసుపత్రితో పాటు అల్వాల్ , కొత్తపేట (ఎల్బీ నగర్) టిమ్స్ ఆసుపత్రులను క్రమం తప్పకుండా సందర్శించాలని మంత్రి ఆదేశించారు. అల్వాల్ టిమ్స్‌లో పనులు తుది దశకు చేరుకున్నాయని, ప్రస్తుతం పరికరాల అమరిక జరుగుతోందని అధికారులు మంత్రికి వివరించారు. ఎల్బీ నగర్ టిమ్స్‌లో పనులు ఈ ఏడాది మార్చి నాటికి తుది దశకు చేరుకుంటాయని తెలిపారు. అన్ని పనులను వేగవంతం చేసి, ఆసుపత్రులను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!