అమరావతి : ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన పుణ్య క్షేత్రంగా వినుతికెక్కింది తిరుమల . టీటీడీ పాలక మండలి కాల పరిమితి ముగిసేందుకు ఇంకా ఒక నెల రోజులు మాత్రమే ఉంది. దీంతో తదుపరి చైర్మన్, సభ్యులను ఎవరిని నియమిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక తాజాగా చైర్మన్ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ప్రధానంగా ఇప్పుడు చైర్మన్ గా బీఆర్ నాయుడు ఉండగా మరో నాయుడిని ఈ కుర్చీలో కూర్చో బెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇక చైర్మన్ రేసులో బీఆర్ నాయుడు స్థానంలో కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, నిర్మాత బండ్ల గణేష్, తదితరులు తమ తమ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నట్లు వినికిడి. కాగా టీటీడీ కొత్త చైర్మన్గా అనూహ్యంగా ఓ కొత్త వ్యక్తి పేరును పరిశీలిస్తున్నట్లు టాక్.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆధ్యాత్మిక వేత్త అయిన శ్రీనివాస రామానుజంను సిఎం చంద్రబాబు నాయుడు ఓకే చేసినట్లు తెలుస్తుంది. శ్రీనివాస రామానుజo అనగానే నాటి ప్రముఖ గణిత శాస్త్రవేత్త గుర్తుకు రావడం,అతడి వంశానికి చెందిన వాడని భ్రమ పడటం సహజం. కాని ఆ ఇజం వేరు ఈ రామానుజo ఇజం వేరు. నిత్యం లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణ తో మారుమ్రోగే తిరుమల గిరులలో బీఆర్ నాయుడు రెండేళ్ల పదవీకాలం ఎన్నో వివాదాలతో అత్యంత వివాదాస్పదంగా సాగింది. ఈ నేపధ్యoలో శ్రీనివాస రామానుజం ఆధ్యాత్మిక వేత్తగా కూడా పేరున్న పారిశ్రామికవేత్త కావడంతో ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
శ్రీనివాస రామానుజం అసలు పేరు లోకాద్రి నాయుడు. ఈయన చిత్తూరు జిల్లా వాసి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జియ్యర్ స్వామి సమక్షంలో రామానుజ మతం స్వీకరించిన తర్వాత పేరును శ్రీనివాస రామానుజం అని మార్చుకున్నారు. ఆర్ఎస్ఎస్ భావజలం ఉన్న వ్యక్తి. బీజేపీ అగ్రనేతలకు అత్యంత సన్నిహితులు. 2024ఎన్నికలకు ముందు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన హోమం పూర్తిగా శ్రీనివాస రామానుజం ఆధ్వర్యంలోనే నిర్వహించారు .స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దలకు టీడీపీ నేతలకు మధ్య రాయబారిగా వ్యవహరించారనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ మధ్య పొత్తు కుదరటంలో కూడా లోకాద్రి నాయుడు అలియాస్ శ్రీనివాస రామానుజం కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
పైకి బీజేపీ అనుకూలవాది అయినా, ఇతగాడు టీడీపీపై ఉన్న అత్యంత మక్కువతో 2024లో ఆ పార్టి విజయానికి తనవంతుగా చేసిన పలు ప్రయత్నాల ఫలితమే నేడు ఈ పదవికి ఎంపికకు ప్రధాన కారణమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
