నిత్యావ‌స‌ర ధ‌ర‌ల‌పై నియంత్ర‌ణ లేని స‌ర్కార్

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీష్ రావు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు నిప్పులు చెరిగారు కాంగ్రెస్ స‌ర్కార్ పై. సీఎం రేవంత్ రెడ్డికి స్వంత ప‌నులు, ఆస్తులు పెంచుకోవ‌డంపై ఉన్న శ్ర‌ద్ద ప్రజా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో లేకుండా పోయింద‌న్నారు. కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌నా ప‌రంగా ఫెయిల్ అయ్యింద‌ని ఆరోపించారు. ఓ వైపు
నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దారుణం అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారని వాపోయారు హ‌రీశ్ రావు.

సన్నబియ్యం ధరలు కేవలం నాలుగు నెలల్లోనే 25 శాతం పెరగడం ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్ర‌శ్నించారు. రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం… మరి ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గాల్సింది పోయి.. బియ్యం ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయని సీరియ‌స్ గా నిల‌దీశారు. మీరు ఇస్తున్న సన్నబియ్యం పథకం సఫలం అయితే, ఎందుకు బియ్యం ధరలు అదుపు తప్పుతున్నాయి? మీరు ఇస్తున్న నాణ్యత లేని సన్నబియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాక మరేమిటి? అని ప్ర‌శ్నించారు.

ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నకు MSP పేరిట దక్కుతున్నది నామ మాత్రపు ధర. కానీ మధ్య దళారులుకు దక్కుతున్నది క్వింటాకు రూ.8000 పై మాటేన‌ని మండిప‌డ్డారు. రైతుకు గిట్టుబాటు ధర లేదు.. వినియోగదారుడికి అందుబాటు ధర లేదు.. లాభ పడుతున్నది మాత్రం మధ్య దళారులు?
కళ్ళ ముందే ఈ తతంగం అంతా జరుగుతుంటే, ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు హ‌రీష్ రావు. బియ్యం మాత్రమే కాదు.. ఉల్లి ₹70, వెల్లుల్లి ₹240, పల్లినూనె ₹210, పెసరపప్పు ₹125, కందిపప్పు ₹165 ధరలు అడ్డగోలుగా పెరిగితే సామాన్య కుటుంబం ఎలా బతకాలి? వంటింటి బడ్జెట్ తారుమారవుతున్నా.. పౌరసరఫరాల శాఖ ఏం చేస్తోంది అని ఫైర్ అయ్యారు.

Leave A Reply

Your Email Id will not be published!