జనాభా ప్రాతిప‌దిక‌న‌ బీసీలకు రాజకీయ వాటా దక్కాలి

పట్టాదారులందరూ ఓటు నమోదు చేసుకోవాలి

వ‌న‌ప‌ర్తి జిల్లా : రాష్ట్రంలో బీసీల జ‌నాభాకు అనుగుణంగా వాటా ద‌క్కాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు టీఆర్పీ చీఫ్ , ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌. మల్లన్న చేపట్టిన ‘బీసీ రాజ్యాధికార యాత్రస 20 రోజుకు చేరుకుంది. ఎర్రవల్లి నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర బీచుపల్లి, కొండేరు, రంగపూర్ మీదుగా పెబ్బేరుకు చేరుకుంది. అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్‌లో తుమ్మర్ మల్లన్న ప్రసంగించారు. యాత్ర సాగుతున్నంత సేపూ మల్లన్న ప్రజలను కలుస్తూ, వారి మాటలు వింటూ, సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను మల్లన్నకు అందజేశారు. పలు బీసీ సంఘాల నాయకులు మల్లన్నను కలిసి బీసీ రాజ్యాధికార యాత్రకు తమ మద్దతును ప్రకటించారు.

బీసీలకు రాజ్యాధికారం ఎందుకు అవసరమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు. జనాభాలో అత్యధిక భాగం ఉన్న బీసీలు, కేవలం ఇతరులను అధికారంలో కూర్చోబెట్టే ఓటర్లుగానే మిగిలి పోకుండా రాజకీయ అధికారంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. జనాభాకు అనుగుణంగా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అవకాశాలు దక్కాలని మల్ల‌న్న‌ పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బీసీలలో రాజకీయ నాయకత్వాన్ని పెంపొందించు కోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు

తెలంగాణలో భూమి, ఆస్తులు రెడ్డి, వెలమ వర్గాల చేతుల్లో కేంద్రీకృతమై ఉండటంపై మల్లన్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనాభాలో మన వాటా ఎంత..? భూమిలో మన వాటా ఎంత..? రాజకీయ అధికారంలో మన వాటా ఎంత..? – ఈ విషయాలపై ఆలోచించాలని ఆయన బీసీలను కోరారు. బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ గరిష్ట పరిమితి చట్టాన్ని (Land Ceiling Act) సవరించి, రెడ్డి , వెలమల చేతుల్లో ఉన్న కోటి ఎకరాల భూమిని భూమి లేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున పంపిణీ చేస్తామని మ‌ల్ల‌న్న ప్ర‌క‌టించారు.

అర్హులైన పట్టాదారులు తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని మల్లన్న పిలుపునిచ్చారు. పట్టాదారుల ఎన్నికల్లో బీసీలు తమ రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాలని ఆయన కోరారు; బీసీలలో చైతన్యం వచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ రెండవ ఎమ్మెల్సీ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మన ఓట్ల బలాన్ని బీసీలందరూ చూపించాలని ఆయన అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!