రైత‌న్న‌ల పెట్టుబ‌డికి ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా రక్షణ

టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి : భవిష్యత్ లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు నష్ట పోకుండా బీమా రక్షణ కవచంలా నిలిచేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పంటల బీమాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల‌ని, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్గదర్శకాలు అందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ సీజన్‌లో అర్నబ్, మురసు తుఫాన్లు వెంట వెంటనే ప్రభావం చూపినప్పటికీ ఎదుర్కొనేందుకు అన్ని విధాలా చర్యలు చేపట్టాం అన్నారు. అయితే వ్యవసాయ రంగానికి ఈ తుఫాన్ల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి 22 రకాల పంటలను బీమాకు నోటిఫై చేశాం అని తెలిపారు. ఇందులో 15 పంటలకు దిగుబడి ఆధారిత బీమా, మరో 7 పంటలకు వాతావరణ ఆధారిత బీమా అమలు చేస్తున్నాం అని వెల్ల‌డించారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యల ఫలితంగా పంటల బీమాలో రైతుల నమోదు గణనీయంగా పెరిగిందని చెప్పారు.

పంటల బీమా కల్పించడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ 6వ స్థానంలో ఉందన్నారు. ఈసారి 17.07 లక్షల మంది రైతులు సాగు చేసిన పంటలకు బీమా కల్పించామ‌ని పేర్కొన్నారు. బీమా చేయించిన మొత్తం విస్తీర్ణంలో వరి, కందులు, వేరుశనగ, పత్తి, మిరప, మొక్కజొన్న పంటల వాటా 90 శాతంగా ఉందన్నారు. వరి పంట సాగు విస్తీర్ణంలో అధిక భాగం తుపాను ప్రభావిత 16 జిల్లాల్లోనే ఉందని తెలిపారు సీఎం. క్లస్టర్ల వారీగా వివిధ బీమా కంపెనీలకు పంటల బీమా బాధ్యతలను అప్పగిస్తున్నాం అని పేర్కొన్నారు. పంటల దిగుబడి ఆధారంగా బీమా పరిహారం నిర్ణయించే విధానాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. తుఫాన్ల సమయంలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం అని పేర్కొన్నారు. పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ రెండూ అందితే రైతుకు పెట్టుబడి తిరిగి రావడంతో పాటు, ఆర్ధిక భద్రత కలుగుతుందని స్ప‌ష్టం చేశారు. బీమా ప్రీమియం చెల్లించిన వారికి పరిహారం అందేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఒక్కరికీ నష్టం జరగకూడదని అన్నారు. బీమా కంపెనీలు కూడా పారదర్శకంగా, నిజాయితీగా పని చేయాల‌ని నొక్కి చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!