మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలి : సీఎం

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై ఎ. రేవంత్ రెడ్డి ఆదేశం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎల్ నినో ప్ర‌భావం అధికంగా ఉండ‌డంతో సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డ‌నున్నాయి. దీంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టడం ప్రారంభించారు. ఇప్ప‌టికే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డంపై దృష్టి సారించారు. తాజాగా స‌చివాల‌యంలో సీఎం కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో క‌లిసి. తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాల‌ని ఆదేశించారు. ముంపునకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని నీటి పారుద‌ల శాఖ‌కు సంబంధించిన ఉన్న‌తాధికారుల‌కు సూచించారు. ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలు, ఇతర అంశాలకు సంబంధించిన పత్రాలను మహారాష్ట్రకు అందజేయాలని సీఎం స్పష్టం చేశారు.

మహారాష్ట్రతో ఇటీవల జరిపిన చర్చలు, ఇతర అంశాలపైన అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్‌లో ఉంచుతామన్నారు సీఎం. భూముల ముంపుపైన మహారాష్ట్ర ఎలాంటి సర్వే చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అధికారులకు కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, ఇరిగేషన్ ఈఎన్‌సీ (జనరల్) రమేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సార‌థ్యంలో మంత్రులు, అధికారుల బృందం మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ తో భేటీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా తుమ్మ‌డిహ‌ట్టి బ్యారేజ్ చేప‌ట్టేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించారు సీఎం ఫ‌డ్న‌వీస్.

Leave A Reply

Your Email Id will not be published!