పంజాబ్ : పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలోనే శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆప్ పవర్ లో ఉంది. భగవంత్ మాన్ సీఎంగా కొనసాగుతున్నారు. ఇండియా కూటమిలో ఆప్ భాగస్వామ్యం అయినప్పటికీ ఆ పార్టీ అధినేత దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రస్తుత సర్కార్ పై నిప్పులు చెరిగారు. మత్తు మందులకు, మాఫియా పాలనకు పంజాబ్ కేరాఫ్ గా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఆప్ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీని ఉద్దేశించి మరోసారి పప్పు అంటూ మండిపడింది. ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు చేసింది. దీంతో పంజాబ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్-ఆప్ మధ్య వైరం వ్యక్తిగత స్థాయికి చేరింది.
రాహుల్ గాంధీ చేసిన ‘మద్యం’ వ్యాఖ్యలు ఆప్ చేసిన ‘పప్పు’ అనే విమర్శలే దీనికి కారణం. 2027లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ , ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుల మధ్య రాజకీయ పోరు వ్యక్తిగత విమర్శల స్థాయికి దిగజారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భగవంత్ మాన్‌తో జరిగిన సమావేశం సందర్భంగా, ఉదయం 11 గంటలకే ఆయన నుంచి “మద్యం” వాసన వస్తోందని ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా ఆమ్ ఆద్మీ పార్టీ రాహుల్ గాంధీని “పప్పు” అని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో ప్రజలను ఉద్దేశించి “గాంధీపై మీకు నచ్చిన అత్యుత్తమ జోక్‌ను” పోస్ట్ చేయమని కోరింది. ఈ పరిణామం ‘ఇండియా’ కూటమిలోని ఈ రెండు కీలక పక్షాల మధ్య ఉన్న విభేదాలను బయట పెట్టింది.