ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో

తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలోన‌ని తిరుపతి న‌గ‌రంలో కొలువు తీరిన పురాత‌న పుణ్య క్షేత్రం , భ‌క్తుల కొంగు బంగారంగా భావించే శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నవంబ‌రు 8న దీపావ‌ళి ఆస్థానం సంద‌ర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. ఈ సందర్భంగా ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవింద రాజ స్వామి వారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

అనంతరం భక్తులను సర్వ దర్శనానికి అనుమతించారు. నవంబ‌రు 8వ తేదీ దీపావళి సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం వైభవంగా నిర్వ‌హించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకు వచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు . ఇవాళ జ‌రిగిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్‌ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయులు, అర్చక బృందం పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!