అమరావతి : మురసు తుపాను కారణంగా ఏపీకి అపార నష్టం వాటిల్లిందని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. తుఫాన్ నష్టంపై సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం వర్చువల్ గా భేటీ అయ్యింది. తుపాను నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి వచ్చింది కేంద్ర బృందం. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ముఖ్యమంత్రితో తుఫాన్ నష్టంపై చర్చించింది కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో 7 మంది సభ్యులతో కేంద్ర బృందం. బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో రెండు బృందాలుగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంట పొలాలు, కాలువలు, రహదారులు, ఇళ్లు పరిశీలించారు. బాపట్ల, జమ్మలపాలెం, చీరాల, చిన్నగంజాం, పర్చూరు, నిడమర్రు, ఉంగుటూరు, చిలకలూరి పేట, గౌరీపట్నం సహా దాదాపు 60 ప్రాంతాల్లో పర్యటించారు. భీమడోలు మండలం సూరప్పగూడెంలో పంట నష్టంపై నేరుగా రైతులతో మాట్లాడారు. రావులపర్రులో డ్రెయినేజీ, వరి పంటలను పరిశీలించారు. కునకలమర్రులో కొమ్ము కాలువ, రహదారులు, సాగునీటి వ్యవస్థను దగ్గరుండి తీశారు. చీరాలలో మత్స్యకారుల పడవలకు జరిగిన నష్టం పరిశీలించారు.
బొప్పూడిలో పక్కా ఇళ్లు, ఉద్యాన పంటలు, వ్యవసాయం, బాతుల పెంపకందారులకు జరిగిన నష్టం గురించి ఆరా తీశారు. ఏడ్లపాడు–తుర్లపాడు మధ్య జలాది మీదుగా ఉన్న ఆర్ అండ్ బీ రహదారులను పరశీలించారు.
ఈ సందర్బంగా తనను కలిసిన కేంద్ర బృందంతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎల్‌నినో ఓవైపు… ఒకేసారి రెండు తుఫాన్లు రావడం రాష్ట్రానికి భారీ నష్టం కలిగించిందన్నారు. తుఫాన్ గమనాన్ని ముందే అంచనాన్ని వేసి ముందస్తు చర్యలు తీసుకున్నాం . తుఫాన్ తదనంతరం యుద్ధవేగంతో సహాయ కార్యాక్రమాలు నిర్వహించాం. రహదారులు, విద్యుత్, మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ వంటివి 24 గంటల్లోనే పునరుద్ధించగలిగాం అని తెలిపారు సీఎం. తాము తీసుకున్న చర్యల వల్ల తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చాయన్నారు. పంట నష్టపోయిన రైతులకు బీమా సాయం త్వరగా అందేలా పని చేస్తున్నాం అని తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అదనపు రేషన్ కూడా అందించాం అన్నారు. కోస్తాంధ్ర ప్రాంతం తరచూ తుఫాన్లు ఎదుర్కొంటూనే ఉందన్నారు.
తుఫాన్ నష్టాన్ని తగ్గించేలా శాశ్వత పరిష్కారంగా మౌలిక వసతులు మరింత ధృఢంగా నిర్మించాల్సి ఉందని, దీనికి కేంద్రం సహకరించాలని కోరారు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 10 రోజుల్లో తుఫాన్ నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించాలని కేంద్ర బృందాన్ని కోరారు సీఎం.
మురసు వల్ల దాదాపు రూ.2484.43 కోట్ల నష్టం జరిగినట్టు కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వ అంచనాలతో నివేదిక సమర్పించారు. మురసు తుఫాన్‌తో 1,385 కి.మీ. రహదారులు, 36 చోట్ల గండ్లు, 65 కల్వర్టులు దెబ్బతినగా రూ.888.84 కోట్ల నష్టం వాటిల్లింది. 1,43,617 హెక్టార్లలో రూ.874.97 కోట్ల పంట నష్టం వాటిల్లగా, 1,86,063 మంది రైతులు ప్రభావితమయ్యారని తెలిపారు సీఎం. 6,756 హెక్టార్ల ఉద్యానపంటలకు రూ.337.10 కోట్ల నష్టం జరగ్గా, 12,605 మంది రైతులు ప్రభావితమయ్యారు. 369 సాగునీటి వనరులు, 509 చోట్ల గండ్లు పడ్డాయని, గ్రామీణ ప్రాంతాల్లో 220 కి.మీ. మేర 114 రహదారులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. 10,192 11 కేవీ విద్యుత్ స్తంభాలు, 6,442 ఎల్‌టీ స్తంభాలు, 1,448 డీటీఆర్‌లు దెబ్బతిన్నాయని, అత్యవసర సహాయక చర్యల వ్యయం రూ.37.00 కోట్లు కేటాయించామన్నారు.