హైదరాబాద్ : ‘మ్యాడ్’ హీరో రామ్ నితిన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు; ఇందులో ఇద్దరు అందమైన కథానాయికలు నటించనున్నారు. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు రామ్ నితిన్, తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన కెరీర్‌లో వైవిధ్య భరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నఈ హీరో తదుపరి చిత్రంగా తెలుగు-తమిళ భాషల్లో రూపొందనున్న ఒక సరికొత్త ప్రేమకథలో కథానాయకుడిగా నటించనున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన కార్తీక్ జయపాలన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో రామ్ నితిన్‌తో పాటు ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారు.
‘పార్కింగ్’, ‘టిటిటి’ చిత్రాలతో ఆకట్టుకున్న ప్రార్థనా నాథన్ , ‘ఎన్నా సొల్ల పోగిరాయ్’ చిత్రంతో గుర్తింపు పొందిన తేజు అశ్విని ఇందులో కథానాయికలుగా ఎంపికయ్యారు. ఈ సరికొత్త ప్రేమకథలో వీరి ముగ్గురి మధ్య ఉండే కెమిస్ట్రీ యువ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. జాతీయ అవార్డు గెలుచుకున్న ‘పార్కింగ్’ తెలుగులో ‘వివాహ భోజనంబు’ వంటి చిత్రాలను నిర్మించిన కె.ఎస్. సినిష్‌కు చెందిన ‘సోల్జర్స్ ఫ్యాక్టరీ’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో పేరున్న సంజయ్ జి. స్థాపించిన ‘రెడాక్టెడ్ స్టూడియోస్’ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి సహ-నిర్మాతగా అడుగు పెడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ , షూటింగ్ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
