చెన్నై : 75 ఏళ్ల వయసులో కన్నుమూసిన కొలత్తూరు టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు పార్థివ దేహాన్ని మోశారు టీవీకే పార్టీ చీఫ్, సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ఓడించి కొలత్తూరు నియోజకవర్గాన్ని డీఎంకే నుంచి కైవసం చేసుకోవడంతో బాబు రాజకీయంగా వెలుగులోకి వచ్చారు. వి.ఎస్. బాబు సుదీర్ఘకాలంగా శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ, చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బాబు, సెప్టెంబర్ 9న ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుండి ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు.
వైద్యుల బృందం ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చివరకు గుండెపోటు రావడంతో మరణించారని ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. బాబు మరణం “తీరని లోటు” అని పేర్కొన్న విజయ్, ఆయన తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారని, ప్రజల మధ్య ఉంటూ వారి ప్రేమను, మద్దతును, నమ్మకాన్ని గెలుచుకున్నారని కొనియాడారు. బాబు కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, టీవీకే నాయకులకు, కార్యకర్తలకు, కొలత్తూరు ప్రజలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బాబు మరణం నేపథ్యంలో పార్టీ తరపున ఏడు రోజుల సంతాప దినాలను పాటిస్తామని టీవీకే ప్రధాన కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎన్. ఆనంద్ ప్రకటించారు. ఈ కాలంలో పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నామని, పార్టీ జెండాను అవనతం (సగం వరకు దించి) ఉంచుతామని ఆయన తెలిపారు. ప్రజా పనులు , క్రీడా అభివృద్ధి శాఖ మంత్రి, టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున మాట్లాడుతూ బాబు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండేవారని, పార్టీ నాయకత్వం పట్ల ఎంతో విశ్వాసంతో ఉండేవారని, అటువంటి వ్యక్తిని పార్టీ ఎప్పటికీ గుర్తుంచు కుంటుందని పేర్కొన్నారు.
ఉత్తర చెన్నైలో బాబు ఒక కీలక వ్యక్తి అని పేర్కొన్న అర్జున, ఆయన స్థానిక ప్రజలతో బలమైన అనుబంధాన్ని కలిగి ఉండటమే కాకుండా, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతో తోడ్పడ్డారని చెప్పారు. పార్టీ నాయకత్వంతో జరిగిన తన మొదటి సమావేశంలోనే కొలత్తూరు, పెరంబూరు , విల్లివాక్కం ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బాబు వారి దృష్టికి తీసుకు వచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. బాబు అంతిమ యాత్రలో సీఎం విజయ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొన్నారు . నివాళులు అర్పించారు.
