డెహ్రాడూన్ : డెహ్రాడూన్ సాహిత్య ఉత్సవంలో మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఇంతియాజ్ అలీ తమ సహకారానికి సంబంధించిన తెర వెనుక కథలను పంచుకున్నారు. ‘రాక్‌స్టార్’ కోసం చెల్లింపులో ఎనిమిది నెలల జాప్యం జరిగిందని రెహమాన్ వెల్లడించగా ‘హైవే’ సౌండ్‌ట్రాక్ ఊహించని విధంగా ఒక పాట నుండి 14 పాటలకు ఎలా విస్తరించిందో అలీ గుర్తు చేసుకున్నారు. “హైవే”లో మొదట ఒకే పాట ఉండగా అది చివరికి 14 పాటలైంది. కాగా “రాక్‌స్టార్” కోసం చెల్లింపు ఎనిమిది నెలలు ఆలస్యమైంది. చిత్రనిర్మాత ఇంతియాజ్ అలీ , సంగీత స్వరకర్త ఏ ఆర్ రెహమాన్, 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న తమ విజయవంతమైన భాగస్వామ్యంలోని అంతగా తెలియని కథలను నిష్కపటంగా గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న డెహ్రాడూన్ సాహిత్య ఉత్సవంలో ఆస్కార్ విజేత అయిన ఈ సంగీత స్వరకర్త ప్రఖ్యాత దర్శకుడు “రాక్‌స్టార్” (2011) , “హైవే” (2014)తో సహా తమ ప్రసిద్ధ సహకారాలలో కొన్నింటి గురించి చర్చించారు. అనిశ్చితి, ఊహించని మలుపులు, గణనీయమైన గందరగోళం నుండి తమ అత్యంత గుర్తుండి పోయే కొన్ని పాటలు ఎలా ఉద్భవించాయో వారు వెల్లడించారు. రాక్‌స్టార్’ నిర్మాత సౌండ్‌ట్రాక్‌తో అసంతృప్తిగా ఉన్నారని, సినిమా విడుదలైన తర్వాత దాదాపు ఎనిమిది నెలల వరకు తనకు డబ్బు చెల్లించలేదని రెహమాన్ చెప్పడంతో ఈ చిత్రంలోని ఒక సంచలన విషయం వెల్లడైంది.
‘రాక్‌స్టార్’ సినిమా మొత్తానికి నిర్మాత నాకు డబ్బు చెల్లించలేదు. ‘నాకు సంగీతం నచ్చలేదు’ అని ఆయన అన్నారు. ఈ సమయంలో నేను సంగీతకారులకు, నా ప్రయాణ ఖర్చులకు చెల్లిస్తూనే ఉన్నాను. ఈ సినిమాకు నాకు ఒక్క పైసా కూడా రాలేదని నేను అలీకి కూడా చెప్పలేదు అని రెహమాన్ అన్నారు. సినిమా విడుదలైన ఎనిమిది నెలల తర్వాత తనకు చివరకు చెక్కు అందిందని ఆయన తెలిపారు.‘రాక్‌స్టార్’ నిర్మాణంలో ఇతర మలుపులు కూడా ఉన్నాయి. వాటిలో ఒక సరదా సంఘటన ఏమిటంటే కలిసి పనిచేసిన ఇద్దరూ ఒకరికొకరు కనిపించకుండా పోయారని అనుకోవడం.
రెహమాన్ స్పందన కోసం తాను ఎదురు చూశానని అలీ గుర్తు చేసుకున్నారు. అయితే తాను అప్పటికే రెండు పాటలపై పనిచేసి, మూడు ఆలోచనలను అభివృద్ధి చేసినప్పటికీ, దర్శకుడితో తనకు ఎలాంటి సంప్రదింపులు లేవని ఆ సంగీత దర్శకుడు చెప్పారు. అప్పటికి రెహమాన్ ఆ ప్రాజెక్ట్‌ను చేపట్టడానికి ఇష్టపడటం లేదేమో, లేదా కేవలం కాదనలేనంత మర్యాద చూపిస్తున్నాడేమో అని ఆ చిత్ర నిర్మాతకు అనుమానం రావడం మొదలైంది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ఆలియా దర్గా వద్ద లొకేషన్ పరిశీలన చేస్తున్నప్పుడు ఈ రహస్యం బయట పడింది. ఆ దర్గాలో పనిచేసే ఒక వ్యక్తి ద్వారా రెహమాన్ అక్కడ ఒక పాటకు సంగీతం సమకూరుస్తున్నారని అలీ సహాయ దర్శకుడు తెలుసుకున్నారు. ‘రాక్‌స్టార్’ చిత్రంలో ఈ దర్గా సన్నివేశాలు ఉండటంతో, రెహమాన్ ఈ ప్రాజెక్టులో భాగమేనని అలీ నమ్మారు.
చివరకు అలీ స్వయంగా రెహమాన్‌ను సంప్రదించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందిస్తూ, తప్పకుండా! మనం ఈ సినిమా చేస్తున్నాం. ఇప్పటికే మూడు పాటలు సిద్ధం చేశాను అని చెప్పారు.’రాక్‌స్టార్’ చిత్రంలో కొన్ని అనుకోని గందరగోళాలు ఎదురైతే, ‘హైవే’ చిత్రం విషయంలో ఒక ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. అదేమిటంటే కేవలం ఒక్క పాటతో మొదలైన ఈ చిత్రంలోని పాటల సంఖ్య చివరకు 14కి చేరింది. ఆ విశేషాలను గుర్తు చేసుకుంటూ అలీ ఇలా చెప్పారు. ‘రాక్‌స్టార్’ తర్వాత రెహమాన్ స్కైప్ ద్వారా తనను సంప్రదించి, కొత్త సినిమా ఏదైనా చేస్తున్నానా అని, దానికి సంగీతం అందించమంటారా అని అడిగారు.
నేను ఆయనతో ‘సార్, ఈ సినిమాలో కేవలం ఒక్క పాట మాత్రమే ఉంది అని చెప్పాను. దానికి ఆయన, ‘పర్వాలేదు, అసలు కథ ఏమిటి?’ అని అడిగారు. అలా మేము సినిమా మొదలు పెట్టాం; ఒక్క పాటతో మొదలై, చివరకు 14 పాటలు తయారయ్యాయి. ఇప్పుడు ‘రాక్‌స్టార్’ కంటే ‘హైవే’లోనే ఎక్కువ పాటలు ఉన్నాయి అని అలీ చెప్పగానే ప్రేక్షకులు నవ్వులతో స్పందించారు. అయిత ఒక సినిమా సంగీత ప్రణాళికలు ఇలా ఊహించని మలుపు తిరగడం రెహమాన్‌కు ఇదే మొదటిసారి కాదు .1995లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘బాంబే’ గురించి చెబుతూ,రెహమాన్ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మొదట మణిరత్నం ఈ చిత్రాన్ని కేవలం 20 రోజుల్లో పాటలు ఏవీ లేకుండా ఒక డాక్యుమెంటరీ తరహాలో తీయాలని అనుకున్నారట.
కానీ, చివరికి ఆ చిత్రంలో ఐదు పాటలు చోటు చేసుకున్నాయి. వాటిలో చాలా పాటలు అవార్డులను గెలుచు కోవడమే కాకుండా, ప్రజలందరికీ ఎంతో ఇష్టమైనవిగా మారిపోయాయి. ఈ సంభాషణలో ఒక పాట ఎప్పుడు హిట్ అవుతుందో చెప్పలేమనే అంశం కూడా చర్చకు వచ్చింది. తమకు అంతగా నచ్చని పాట ఏదైనా ఉందా అని అడిగినప్పుడు రెహమాన్ ‘షెహర్ మే హూ మై తేరే’ అనే పాటను పేర్కొన్నారు. తాము అంతగా ఇష్టపడని ఒక పాటను రూపొందించడానికి ప్రయత్నించాం. అది సూపర్ హిట్ అయ్యింది.
