మత్స్యకారుల ప్రాణరక్షణ కోసం ప్ర‌భుత్వం ఫోక‌స్

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

అమరావతి : మత్స్యకారుల ప్రాణరక్షణ, వారి కుటుంబాల భద్రత, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడూ ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మత్స్యకారుల భద్రత, ట్రాన్స్‌పాండర్ల ఏర్పాటు, బోట్ల ఫిట్‌నెస్, బీమా సౌకర్యం తదితర అంశాలపై మంత్రి శుక్రవారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫానులు, విపత్కర పరిస్థితుల్లో మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, ఆర్టీజీఎస్ జారీ చేస్తున్న హెచ్చరికలను పట్టించు కోకుండా కొందరు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తుండటం ఆందోళనకరమన్నారు. సముద్రంపై ఎంత అనుభవం ఉన్నప్పటికీ ప్రకృతి విపత్తులను తేలిగ్గా తీసుకోవద్దని హితవు పలికారు. ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా విలువైన ప్రాణాలను బలి తీసుకుంటుందని, కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతుందని పేర్కొన్నారు. తుఫానుల సమయంలోనే కాకుండా సాధారణ వేటకు వెళ్లేటప్పుడు కూడా ప్రభుత్వం రూపొందించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (SOP) కచ్చితంగా అనుసరించాలని సూచించారు. భద్రతా ప్రమాణాలపై మత్స్యకారులకు ముందుగా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, ఆ తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడం మత్స్యకారుల ప్రాణాలను కాపాడటానికేనని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని సుమారు 80 శాతం మత్స్యకార బోట్లకు ఇప్పటికే ట్రాన్స్‌పాండర్లు అమర్చినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన బోట్లకు కూడా వీలైనంత త్వరగా వీటిని ఏర్పాటు చేసేందుకు మత్స్యశాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సముద్రంలో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ట్రాన్స్‌పాండర్లను ఎలా వినియోగించాలి, వాటి ద్వారా సహాయం ఎలా పొందాలనే అంశాలపై మత్స్యకారులకు ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. పరికరాలను అమర్చడంతోనే బాధ్యత పూర్తయినట్లు భావించకుండా అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. సాంకేతిక లోపాలున్న వాటికి తక్షణమే మరమ్మతులు చేయించాలని, సాధ్యంకాని పక్షంలో కొత్తవి అందించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ట్రాన్స్‌పాండర్ల ఏర్పాటు, నిర్వహణ, వినియోగంపై అవగాహన కల్పించడంలో అధికారుల అలసత్వాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా తీరప్రాంతాల్లోని మత్స్యకార బోట్ల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలపై మరోసారి సమగ్ర తనిఖీలు నిర్వహించాలని మత్స్యశాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. ఎన్ని బోట్లకు ట్రాన్స్‌పాండర్లు అమర్చారు, ఇంకా ఎన్నింటికి ఏర్పాటు చేయాల్సి ఉంది, అమర్చిన వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి, మిగిలిన బోట్లలో ఏర్పాటు చేయకపోవడానికి కారణాలేమిటనే వివరాలతో పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. సాంకేతిక సమస్యలతో పాటు అధికారుల స్థాయిలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందే బోట్ల ఫిట్‌నెస్, అవసరమైన రక్షణ పరికరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. ట్రాన్స్‌పాండర్లు పాడైనా, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా మత్స్యకారులు వెంటనే సంబంధిత ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ), ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్ లేదా గ్రామస్థాయిలోని విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదులు అందిన వెంటనే అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. సంబంధిత సిబ్బంది నుంచి సరైన స్పందన లేకపోతే నేరుగా తన దృష్టికి సందేశం ద్వారా తీసుకురావచ్చని, అటువంటి విషయాలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని మత్స్యకారులకు మంత్రి భరోసా ఇచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!