తాడేపల్లి గూడెం : రాయలసీమ లిఫ్ట్ స్కీంపై తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం వాస్తవాలను మరుగున పరుస్తోందన్నారు మాజీ సీఎం జగన్ రెడ్డి. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన సీఎం నారా చంద్రబాబు నాయుడు తన హాట్‌లైన్ కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాల కోసం మౌనంగా ఉన్నాడని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు! దీనికి అదనపు నీటి కేటాయింపులు లేవన్నారు. కొత్త కాల్వలు లేవు, అదనపు రిజర్వాయర్లు లేవు, అదనపు ఆయకట్టూ లేదు. అదే కృష్ణానది, అవే నీళ్లు, అవే కేటాయింపులు, అదే పోతిరెడ్డిపాడు నుంచి అవే కాల్వల ద్వారా దుర్భిక్ష పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే, అవే రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన, అవే జలాలనే సమర్థవంతంగా వినియోగించు కునేందుకు ఏర్పాటు చేసిన ఒక ఇన్సూరెన్స్ స్కీం లాంటిదే ఈ పథకం తప్పా మరోటి కాదన్నారు జగన్ రెడ్డి.
కొన్ని దశాబ్దాలుగా కృష్ణానది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో పైనుంచి నీళ్లు రాక పోవడం ఒక సమస్య అయితే, వచ్చిన ఆ నీటిని కూడా తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఇష్టానుసారంగా దిగువకు వదిలేయడం మరొక తీవ్రమైన సమస్య అని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో అంటే 44వేల క్యూసెక్కుల నీళ్లు పారాలంటే శ్రీశైలంలో నీటిమట్టం కనీసం 880 అడుగులపైన ఉండాలన్నారు. ఆ నీటి మట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లే పంపలేం అని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆ 880 అడుగులపైన రిజర్వాయర్ లెవల్ ఎన్నిరోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. దీనివల్ల రాయలసీమ తాగునీటి, సాగునీటి అవసరాలు తీరడం అసాధ్యంగా మారుతూ వస్తోందన్నారు జగన్ రెడ్డి.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తీసుకునేందుకు పాలమూరు-రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు, డిండి ద్వారా 0.5 రోజుకు టీఎంసీ, కల్వకుర్తి ద్వారా రోజుకు 0.4 టీఎంసీ , ఎస్ఎల్బీసీ ద్వారా రోజుకు 0.5 టీఎంసీ, మొత్తంగా దాదాపుగా రోజుకు 3 టీఎంసీలు తరలించే సామర్థ్యంతో జోరుగా ముందుకెళ్తోందన్నారు. వీటికి తోడు 800 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని వదిలేస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రత్యామ్నాయంగా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ స్కీంను చేపట్టాం అన్నారు మాజీ సీఎం. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోలేని సంక్లిష్టమైన పరిస్థితుల్లో లిఫ్ట్ చేసి, అదే పోతిరెడ్డిపాడు కాల్వలోకి నీటిని ఎత్తిపోసి, ఇప్పటికే ఉన్న పాత రిజర్వాయర్లకు చేర వేయడమే ఈ పథకం ఉద్దేశం అన్నారు.
నీటి కేటాయింపులు ఉన్నా, వినియోగించుకునే అవకాశం లేకపోతే ఆ కేటాయింపులకు సార్థకత ఏముంటుంది? అదనపు నీటి కేటాయింపులు, అదనపు రిజర్వాయర్లు లేనప్పుడు ఈ పథకం వల్ల ఎవరికి, ఏం నష్టం వస్తుంది? ప్రజల దాహార్తిని తీర్చే ఇన్సూరెన్స్ లాంటి రాయలసీమ లిఫ్ట్ స్కీంను భూతద్దంలో చూపించడం భావ్యమా అని ప్రశ్నించచారు మాజీ సీఎం. దురదృష్టవశాత్తూ దాదాపుగా పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే, ఎక్కడ తనకు పేరు వస్తుందోనని ఆపేశారు. ఈ పథకాన్ని పూర్తిచేయాల్సింది పోయి, ఎవరైనా అభ్యంతరం చెప్తే, దాని ఆవశ్యకతను బలంగా వినిపించాల్సింది పోయి, హాట్‌లైన్ రాజకీయాలకోసం బలిపెట్టారన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరువులాంటి విపత్కర పరిస్థితుల్లో హక్కుగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీసి, రాయలసీమ ప్రజల ప్రాణాధారానికే ఉరివేశాడన్నారు.
