న‌మ్ముకున్న భ‌క్తుల‌కు శ్రీ‌వారి అండ‌దండ‌లు

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ముఖ్య‌మంత్రి

తిరుమ‌ల : పూర్వ కాలంలో దేవాలయాల మీద చాలా దాడులు జరిగాయి… కానీ వెంకటేశ్వరస్వామి దేవాలయం విషయంలో ఎవ్వరూ ఆ సాహసానికి ఒడిగట్టలేదని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు అన్నారు. రోజు రోజుకూ శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని పెంపోందించడానికి చాలా మంది కృషి చేశారని చెప్పారు. కొలిచిన వారికి, నమ్మిన వారికి శ్రీవారు రక్షణగా నిలిచారని, అది తన విషయంలో నిరూపితమైందన్నారు. ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే నాపై అలిపిరిలో దాడి జరిగిందని… చాలా పకడ్బందీగా నాపై దాడి జరిగినా… స్వామి కృప వల్లే ఆ దాడిలో ఎవ్వరూ చనిపోలేదని చెప్పారు. వెంకటేశ్వర స్వామే ప్రాణభిక్ష పెట్టారని… పునర్జన్మనిచ్చారంటూ సీఎం భావోద్వేగంతో నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. ప్రపంచం మొత్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో విశ్వాసం పెంపోందించేలా కార్యక్రమాలు చేపడుతున్నామ‌ని తెలిపారు సీఎం . భక్తుల విరాళాలు, ఆదాయాన్ని వెల్లడించడం, భక్తులు ఇచ్చిన విరాళాలను వారి సౌకర్యాలు.. సేవలకే ఖర్చు పెడుతున్నారని తెలిపారు.

తిరుమల కొండపై పచ్చదనం విరాజిల్లుతోందని, దేవుని పవిత్రత కాపాడే విషయంలో రాజీ పడవద్దని టీటీడీకి విజ్ఞప్తి చేశారు. గో-సంరక్షణ, వేద పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని… దీనికి టీటీడీ నాందీ పలకాలన్నారు. శ్రీవారి దేవాలయాన్ని ఆదర్శంగా… పవిత్రతకు మారుపేరుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీవారి సేవకులు చాలా భక్తి విశ్వాసంతో సేవలు అందిస్తున్నారని… వారిని మరింత ప్రొత్సహించాలన్నారు. ఎక్కడికక్కడ శ్రీవారి దేవాలయాలను నిర్మించాలని అన్నారు.… ఆ దేవాలయాల్లో ప్రశాంత, పవిత్ర వాతావరణం ఉండేలా చూడాలని నిర్దేశించారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి దేవాలయాలను నిర్మిస్తామని… విదేశాల్లో కూడా హిందువులు ఎక్కువగా ఉన్న చోట వెంకటేశ్వర స్వామి దేవాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!