హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలోని ఉన్నతాధికారుల బదిలీ సర్వ సాధారణంగా మారింది. ఎవరు ఎప్పుడు ఏ శాఖలో, ఏ పదవిలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ లకు ప్రయారిటీ ఇస్తుండడం చర్చకు దారితీసింది. తాజాగా కీలకమైన అధికారులకు స్థాన చలనం కలిగింది. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు ఐఏఎస్, నాన్-కేడర్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ,అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ సంజయ్ జాజు జీవో ఆర్టీ నం. 1740 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.
హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ను మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్మెంట్ పరిధి ప్రభుత్వ కార్యదర్శిగా బదిలీ చేశారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు . మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఈ.వి. నర్సింహా రెడ్డి ని హెచ్ఎండీఏ కొత్త మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమించారు. మూసీ ప్రాజెక్ట్ ఎండీగా ఆయనకు అదనపు బాధ్యతలు కొనసాగుతాయి. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా బి. అజిత్ రెడ్డికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఆ పోస్టులో ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను రిలీవ్ చేశారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్-కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐ.ఈ.ఎస్.ఎస్.డి. మనోజ్ ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. జలమండలి జేఎండీగా మయాంక్ మిట్టల్ కు జీహెచ్ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా బదిలీ అయిన కె. చంద్రకళకు హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (కోర్ అర్బన్ రీజియన్, ల్యాండ్ పూలింగ్ & మెట్రో రైల్) బాధ్యతలు ఇచ్చారు. అదనంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ స్పెషల్ కలెక్టర్ (LA)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
వరంగల్ స్టేట్ ఆడిట్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పి. రామును విద్యాశాఖ స్పెషల్ ఆఫీసర్ (ప్రాజెక్ట్స్)గా బదిలీ చేశారు. ఇప్పటి వరకు విద్యాశాఖ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న వి. శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసింది. తన మాతృశాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
