అమరావతి : మాజీ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతితో ఏపీ రాజకీయాలలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ తో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన వయసు 82 ఏళ్లు. ఇదిలా ఉండగా గత ఐదు రోజుల కిందట అనారోగ్యంతో గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ రాయపాటి సాంబశివ రావు ఇవాళ తుది శ్వాస విడిచారు. గుంటూరు, నరసారావుపేట లోక్ సభ స్థానాల నుంచి ఎంపీగా గతంలో పని చేశారు. ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలలో చెరగని ముద్ర వేశారు. ఆయనకు అపారమైన అనుభవం నెలకొంది. రాజకీయ పరంగా రాయపాటి సాంబశివ రావు 1972లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి తన పొలిటికల్ ప్రస్థానం ప్రారంభమైంది.
.అనంతరం 1982లో ఆయన్ను రాజ్యసభ సీటు వరించింది. అక్కడి నుంచి 1988 వరకూ రాజ్యసభ ఎంపీగా పనిచేసిన రాయపాటి.. అనంతరం 1996, 1998, 2004, 2009లో గుంటూరు నుంచి లోక్ సభ ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆయన పార్టీని వీడారు. అనంతరం 2014లో టీడీపీలో చేరిన రాయపాటికి నరసరావుపేట నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశం లభించింది. దీంతో నరసరావుపేట ఎంపీగా గెలిచిన ఆయన.. 2019 వరకూ పనిచేశారు. ఇదే క్రమంలో వయస్సు మీద పడుతుండటంతో రాజకీయాల్లో చురుకుగా ఉండలేక పోయారు. ప్రొస్టేట్ క్యాన్సర్ సోకడంతో చికిత్స తీసుకున్నాడు. కొంత కాలం పాటు బాగానే ఉన్నా కానీ ఉన్నట్టుండి రోగం తిరగబెట్టింది. ఆయనతో కలిసి పని చేసిన వారు, స్నేహితులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు తీవ్ర సంతాపం తెలిపారు.
