అయోధ్య విరాళాల కుంభ‌కోణం బీజేపీ మౌనం

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ల‌క్ష్యంగా చేసుకుంది

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అయోధ్య‌లోని రామ‌మందిరం విరాళాల చోరీ వ్య‌వ‌హారాన్ని మ‌రోసారి లేవ‌నెత్తింది. బీజేపీని లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్; ప్రధాని, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ల ‘మౌనం’పై ప్రశ్నలు సంధించింది. నిధుల బాధ్యత కలిగిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇచ్చారని, నిధులకు ఆయనే బాధ్యుడైనప్పుడు, సహజంగానే ఆయన పైనే కీలకమైన ప్రశ్నలు తలెత్తుతాయని కాంగ్రెస్ పేర్కొంది. రామ మందిర విరాళాల చోరీ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ తన విమర్శలను తీవ్రతరం చేసింది. అధికార మదంతో కళ్లు మూసుకు పోయిన ఈ ‘చందా దొంగలను’ శిక్షించడం దేశ పౌరుల బాధ్యత అని కాంగ్రెస్ పేర్కొంది. ఆలయానికి వచ్చిన విరాళాల పూర్తి లెక్కలను బహిర్గతం చేయాలని, బాధ్యులందరి పాత్రపై విచారణ జరపాలని, ఎవరినీ వదలకుండా బాధ్యులను చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ డిమాండ్ చేశారు.

‘ఎక్స్’ వేదికగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాముడి పేరుతో అధికారాన్ని పొందారు, ఇప్పుడు చందా చోరీపై మౌనం వహించారని ఆరోపించారు. శ్రీరాముడి పేరును వాడుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఈ చోరీ అనే పాపం కారణంగానే పతనమవుతుందని ఆయన అన్నారు. ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు అనుకూలంగా ఉండేలా ఉందని ఆయన ఆరోపించారు. అయోధ్యలోని శ్రీరామ మందిరంలో జరిగిన భారీ చోరీ ఘటన 2026 జూన్ 4న వెలుగులోకి వచ్చింది. తొమ్మిది రోజుల తర్వాత, అంటే 2026 జూన్ 13న, ట్రస్ట్ చేసిన అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆగస్టు 17న హోం శాఖ తన తుది నివేదికను అదే ట్రస్ట్‌కు సమర్పించింది. ఊహించినట్లు గానే, ఈ నివేదిక చంపత్ రాయ్ , అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్ ఇచ్చింది అని రమేష్ పేర్కొన్నారు

ఈ చోరీ ఘటన కెమెరాల్లో 105 సార్లు రికార్డైంది. 2026 ఏప్రిల్ 27 నుండి జూన్ 5 మధ్య నమోదైన దృశ్యాల్లో, విరాళాలను లెక్కించే బాధ్యత కలిగిన సిబ్బంది కరెన్సీ నోట్ల కట్టలను దాచిపెడుతున్నట్లు కనిపిస్తోంది అని ఆయన చెప్పారు. ఖజానాకు బాధ్యత వహించే వ్యక్తులే ఈ క్లీన్ చిట్ ఇచ్చారని, నిధుల నిర్వహణలో ప్రధాన బాధ్యత ఖజానా అధికారిదే కాబట్టి, సహజంగానే ఆయన పైనే కీలకమైన ప్రశ్నలు తలెత్తుతాయని ఆయన అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!