సీజేపీ నేత‌ల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ పొడిగింపు

రెండు రోజులు పొడిగించిన న్యాయ‌మూర్తి

న్యూఢిల్లీ : సీజేపీ నాయకుల జ్యుడీషియల్ కస్టడీ మరో 2 రోజులు పొడిగించింది. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు తాళం వేసిన గేటును ఎక్కి లోపలికి ప్రవేశించారనే ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్‌ను గతంలోనే నిరసన ప్రదేశాల జాబితా నుండి తొలగించారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్ , అశుతోష్ రాంకా ల‌ను అరెస్ట్ చేశారు. విచార‌ణ నిమిత్తం వీరికి క‌స్ట‌డీ విధించారు. సౌర‌వ్ , రాంకాను మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు ప‌రిచారు. వారి జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద ఆంక్షలను ఉల్లంఘించి నిరసన తెలిపినందుకు వీరిని అదుపులోకి తీసుకుని, ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అయితే, తమ పార్టీకి చెందిన ఈ ఇద్దరు కో-కన్వీనర్ల విడుదలను అడ్డుకునేందుకు బెయిల్ ప్రక్రియను ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తున్నారని సీజేపీ ఆరోపించింది.

జంతర్ మంతర్ వద్ద వీరు ఇతర సీజేపీ కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ప్రదర్శించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, ఆయన వీరిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. పోలీసులు వీరి కస్టడీని పొడిగించాలని కోరగా, కోర్టు మరో రెండు రోజులు జైలుకు పంపింది. ఇప్పుడు వీరిని బుధవారం నాడు తిరిగి కోర్టులో హాజరు పరచనున్నారు. వీరి బెయిల్ పిటిషన్‌ను విచారిస్తున్న సమయంలో, తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుండి బెదిరింపులు వస్తున్నాయని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఒక ‘నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్’ నమోదు చేశారు. కోర్టు విచారణలను ఆలస్యం చేయడం ద్వారా , వారి విడుదలను అడ్డుకోవడానికి అన్ని రకాల అడ్డదారులు తొక్కుతూ, అషు , సౌరవ్‌ల అక్రమ నిర్బంధాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పొడిగిస్తోందని ఆరోపించారు అభిజిత్ దిప్కే.

Leave A Reply

Your Email Id will not be published!