ఢిల్లీ : ఢిల్లీ విమానాశ్రయంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను మూడు గంటల పాటు అదుపులోకి తీసుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. పారిస్ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో పై నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగానే అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని, అంతేకాకుండా 50,000 రూపాయల జరిమానా కూడా విధించారని ఆ పార్టీ పేర్కొంది. అయితే ఆయనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో లేదా ఎందుకు జరిమానా విధించారో ఆప్ స్పష్టం చేయలేదు. పంజాబ్ ఆప్ మీడియా ఇన్ఛార్జ్ బల్తేజ్ పన్ను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా భగవంత్ మాన్ విదేశీ పర్యటనలకు పదేపదే అనుమతి నిరాకరించిందని, ఈ ఘటన కూడా దానికి కొనసాగింపేనని పేర్కొన్నారు. పంజాబ్ పురోగతికి కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకే మాన్ పారిస్ వెళ్లారని, కేంద్ర ప్రభుత్వం మరోసారి తన “సంకుచిత మనస్తత్వాన్ని” ప్రదర్శించిందని ఆయన విమర్శించారు.
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆహార ఉత్సవంలో పంజాబ్‌కు చెందిన ప్రసిద్ధ ఉత్పత్తులను పరిచయం చేసేందుకు సీఎం భగవంత్ మాన్ అక్కడికి వెళ్లారన్నారు. హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దురుద్దేశం కారణంగా పారిస్‌లోని కాన్సుల్ జనరల్ కూడా ముఖ్యమంత్రిని కలవడానికి రాలేదని పేర్కొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి పట్ల కేంద్రం ప్రదర్శించిన ఈ అసహనం, అవమానకరమైన వైఖరి ఇంతటితో ఆగలేదని ఆయన అన్నారు. మాన్ పారిస్ నుండి తిరిగి వచ్చి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, ఉద్దేశ పూర్వకంగానే ఆయనను మూడు గంటల పాటు అదుపులో ఉంచారు. ‘మీ సామాను ఇంకా వస్తోంది’, ‘సామాను తనిఖీ చేస్తున్నారు’ అంటూ సాకులు చెప్పారని మండిపడ్డారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు, పంజాబ్‌ను అవమానించడమే తప్ప మరోటి కాదన్నారు.
మూడు గంటల తర్వాత మాన్ అక్కడి నుండి వెళ్లడానికి అనుమతి పొంది, తన సామానును వాహనంలో ఉంచి బయలుదేర బోతుండగా అధికారులు ఆయన వెంట పరుగెత్తుకుంటూ వచ్చి, తమపై ‘పై నుండి తీవ్ర ఒత్తిడి’ ఉందని చెప్పారని తెలిపారు.
