చెన్నై : ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పరిపాటిగా మారింది. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇంకొందరిని అరెస్ట్ కూడా చేశారు. తాజాగా వారి సరసన చేరారు చెన్నై నగరానికి చెందిన 95వ వార్డు డీఎంకే పార్టీకి చెందిన కౌన్సిలర్ సుధా దీనదయాళ్. చెన్నే వేదికగా జరిగిన డీఎంకే పార్టీ కార్యక్రమంలో సీఎంపై తీవ్ర అభ్యంతకరమైన , జుగుస్సాకరమైన రీతిలో కామెంట్స్ చేశారు. దీంతో నోరు జారిన కౌన్సిలలర్ కు సుధా దీనదయాళన్‌కు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీయడంతో పాటు అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే) నాయకుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. టీవీకే ప్రతినిధి ఉదయకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌన్సిలర్ , కార్యక్రమ నిర్వాహకులపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని సుధను పోలీసులు ఆదేశించారు.
డీఎంకే ‘ముప్పెరుమ్ విళా’ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. వేదికపైనే ఉన్న డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి వెంటనే స్పందించారు. కౌన్సిలర్ ఉపయోగించిన భాషను బహిరంగంగానే తప్పుబట్టారు. చెన్నైలోని రాజా అన్నామలై మండ్రమ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ ఆర్. ప్రియ, కనిమొళి, ఎమ్మెల్యే పి.కె. శేఖర్ బాబు , ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. డీఎంకే మహిళా విభాగం ప్రతినిధి అయిన సుధ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి విజయ్‌ను ఉద్దేశించి అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. డీఎంకే నాయకత్వాన్ని విమర్శించే హక్కు ఆయనకు ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. 73 ఏళ్ల వయసున్న మా నాయకుడిని విమర్శించడానికి నువ్వెవరు? నీ వయసు కేవలం 52 ఏళ్లు మాత్రమే కదా అంటూ ఆమె అసభ్యకరమైన పదాలను వాడారు. దీనిపై వెంటనే స్పందించిన కనిమొళి, పెరియార్, సి.ఎన్. అన్నాదురై , ఎం. కరుణానిధి వంటి గొప్ప నాయకుల రాజకీయ సంప్రదాయాలను పాటిస్తున్న సంస్థ డీఎంకే అని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు సరైనవి కావన్నారు.
