26న‌ కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల సమావేశం

తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదాలు

న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు సంబంధించి వచ్చే వారంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సమావేశం కానున్నాయి. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీల్లో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాల వాటాకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించిన పరస్పర ఫిర్యాదులు, పోలవరం, టెలీమెట్రీ పరికరాల ఏర్పాటు సహా ఇతర అంశాలు బోర్డు సమావేశాల్లో ప్రస్తావనకు రానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు సంబంధించిన అంశాలు మరోమారు చర్చనీయాంశం కానున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం, రాష్ట్రాల మధ్య నీటి వాటాలు, ప్రాజెక్టుల అనుమతులు, పరస్పర ఫిర్యాదులపై చర్చించేందుకు ఈ నెలలో రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 26వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, 30వ తేదీన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు, ఇంజనీర్లు పాల్గొననున్నారు. ఇప్పటికే పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో జరిగే చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కృష్ణా నదీ జలాల పంపిణీ అంశం మరోసారి కేఆర్‌ఎంబీ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై ఇటీవల జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. ఈనెల 26న జరిగే బోర్డు సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. రెండు రాష్ట్రాలు తమ వాదనలను బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు 66, 34 నిష్పత్తిలోనే పంపకాలు జరగాలని ఏపీ అంటోంది. తెలంగాణ మాత్రం విభేదిస్తోంది. కృష్ణా బేసిన్ అధికంగా ఉన్నందున అందుకు అనుగుణంగా కేటాయింపులు జరగాలని అంటోంది. 70, 30 నిష్పత్తిన కృష్ణా జలాలు వినియోగించు కోవాలని తెలంగాణ కోరుతోంది. రెండు రాష్ట్రాల భిన్న వాదనల నేపథ్యంలో కేఆర్ఎంబీ సమావేశంలో జరగనున్న చర్చ కీలకం కానుంది.

Leave A Reply

Your Email Id will not be published!