స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి : లోకేష్
పార్టీ నేతలు, శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్
అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన వైసీపీ సీనియర్ నేత, గుంటూరు పార్లమెంట్ వైసీపీ ఉపాధ్యక్షుడు, దుగ్గిరాల మాజీ ఎంపీపీ వడ్డేశ్వరపు రజనీకాంత్ నియోజకవర్గ శాసనసభ్యులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతో పాటు 25 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి లోకేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మనందరం ఒక కుటుంబం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పద్ధతి ప్రకారం నెరవేరుస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ, ఆసుపత్రి నిర్మాణంతో పాటు కమ్యూనిటీ భవనాలు, పార్క్ లు, అంగన్ వాడీ భవనాలు, లైబ్రరీలు, స్మశానాలు అభివృద్ధి చేస్తున్నాం. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి చేస్తున్నాం. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 2024 ఎన్నికల కంటే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ రావాలి. కూటమి అభ్యర్థులను గెలిపించాలి. అందరం ఎన్డీయే పక్షాన నిలబడాలి. అదే మనకు శ్రీరామరక్ష.
అప్పుడే మనం అనుకున్న అభివృద్ధి సాధ్యం. ఇందుకు మీ అందరి సహకారం కావాలి. శాంతియుత వాతావరణంలో స్థానిక ఎన్నికలకు వెళ్దాం. కలిసికట్టుగా పనిచేద్దాం. గతంలో పదేళ్లు ఒకరికి అవకాశం ఇచ్చారు. రెండున్నరేళ్లు నాకు ఇచ్చారు. అప్పటికీ, ఇప్పటికీ జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి. మీకు అందుబాటులో ఉండి అహర్నిశలు పనిచేస్తానని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో చిలువూరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోటకూర సీతారామయ్య, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ యాళ్ల జయలక్ష్మీ, టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ చిలువూరి ఏసుపాదం, దుగ్గిరాల మండల టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పినపాటి కరుణాకర్, యూనిట్ ఇంఛార్జ్ చిలువూరి శేషగిరి తదితరులు పాల్గొన్నారు.