హైదరాబాద్: డీఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న తొలి చిత్రం ‘ప్రొడక్షన్ నంబర్ 1’ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్ దామోదర్ నేరేళ్ల తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శశాంక్ దువ్వూరు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవి శివతేజ ,భాస్కర్ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల ప్రధాన పాత్ర ల్లో నటిస్తుండగా, నేహా పఠాన్ కథానాయికగా కనిపించనున్నారు. స్నేహం, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో పాటు సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవిస్తూ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (ఐఏఎంఏ) వ్యవస్థాపకులు, సీఈఓ డాక్టర్ దామోదర్ నేరేళ్ల వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్నారు. గత 26 ఏళ్లుగా యూకే, అమెరికాలో వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఆయనకు సినిమాలపై చిన్నప్పటి నుంచే ప్రత్యేక ఆసక్తి ఉంది. మారుమూల గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. తన సినిమా ప్రయాణం గురించి నిర్మాత డాక్టర్ దామోదర్ నేరేళ్ల మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే సినిమాలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ’ సినిమా చూడటానికి పాఠశాలకు వెళ్లకుండా వరంగల్ వెళ్లిన రోజులు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఇన్నాళ్లుగా తనలో ఉన్న సినిమా కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నానని, తన డ్రీమ్ ప్రాజెక్టు దసరా రోజున ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
దర్శకుడు శశాంక్ దువ్వూరు చెప్పిన కథ తనకు ఎంతగానో నచ్చిందని, ప్రేమ, స్నేహం, కుటుంబ విలువలతో పాటు మంచి సందేశాన్ని అందించే అంశాలు ఇందులో ఉన్నాయని వివరించారు. దర్శకుడిగా శశాంక్‌కు ఇది తొలి చిత్రమైనప్పటికీ, ఆయన ప్రతిభపై, కథపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.
