అమరావతి : ఏపీ కూటమి పార్టీలకు చెందిన అగ్ర నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , పీవీఎన్ మాధవ్ లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వీరు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణం అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాం అన్నారు. ప్రజలు ఆశీర్వదించి పాలనా బాధ్యతను కూటమికి అప్పగించారని తెలిపారు.. రెండేళ్లుగా సంక్షేమ,అభివృద్ది, సుపరిపాలన అందిస్తున్నాం. ప్రజలకు భరోసాను, నమ్మకాన్ని, వారు ప్రశాంతంగా జీవించే పరిస్థితి కల్పించాం అన్నారు. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని తెలిపారు. స్థానిక సంస్థల బలోపేతంతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ది అని కూటమి భావిస్తోందన్నారు కూటమి నేతలు. సకాలంలో ఎన్నికలు జరిగితేనే మనకు 16వ ఆర్ధిక సంఘం, కేంద్రం నిధులు పొందే అవకాశం ఉందన్నారు. అందువల్ల నిర్థేశిత గడువులోగా ఎన్నికలు నిర్వహించుకుని స్వపరిపాలనతో అభివృద్ది పనులు చేయాలని సంకల్పించామని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్దిపై ఏ మాత్రం బాధ్యత లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి రోజు నుంచి ఎన్నికలు అడ్డుకోవాలని కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని ఆరోపించారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , పీవీఎన్ మాధవ్. ఇప్పటి వరకు 59 సార్లు వివిధ కోర్టుల్లో పిటిషన్లు వేసి ఎన్నికలు ఆపడానికి అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. అన్ని అడ్డంకులు తొలగిపోయి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో….వైసీపీ పలు చోట్ల హింసను ప్రేరేపించిందని మండిపడ్డాఉ. పోలీసులపై దాడులకు తెగబడిందన్నారు. ప్రజల కోసం నిర్మించిన రహదారులను తవ్వేసిందని, ఎన్నికలను అడ్డకోవడానికి కుటిల వైఎస్ఆర్ సిపి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యం బద్దంగా, శాంతియుతంగా జరగాలన్నదే కూటమి ప్రభుత్వం నిశ్చయం. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను కూడా గుర్తు చేసుకోవాలని సూచించారు. ఆనాడు రాష్ట్రంలో అల్లకల్లోలంతో, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, ప్రతిపక్షాలు నామినేషన్లు కూడా వేయకుండా భయోత్పాతం సృష్టించి అదే విజయంగా విర్రవీగిందన్నారు. నాటి బలవంతపు ఏకగ్రీవాలపై, ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై అప్పటి ఎస్ఈసీ స్వయంగా కేంద్రానికి లేఖ రాయడం గమనార్హం అని పేర్కొన్నారు.
