టీడీఆర్ సేవ‌ల్లో ఆధార్ ప్రామాణీక‌ర‌ణ సౌక‌ర్యం

ప్ర‌వేశ పెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ సేవల్లో ఆధార్ ప్రామాణీకరణ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టింది. ఈ విధానం ద్వారా ఆస్తి యజమానులు, బిల్డర్లు , డెవలపర్ల నమోదు, లాగిన్, దరఖాస్తుల సమర్పణ, ఆస్తి వివరాలను అనుసంధానించడం వంటి ప్రక్రియలు సులభతరం కానున్నాయి. అలాగే జీహెచ్ఎంసీ , డీటీసీపీ అధికారుల పరిపాలనా పరమైన పనుల కోసం కూడా ఈ ఆధార్ ప్రామాణీకరణను ఉపయోగించనున్నారు. గుర్తింపును నిర్ధారించడం, ప్రక్రియలను సరళీకరించడం, పారదర్శకతను, సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంప్రదింపులతో, ‘ఆధార్ అథెంటికేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సోషల్ వెల్ఫేర్, ఇన్నోవేషన్, నాలెడ్జ్) రూల్స్, 2020’ కింద తెలంగాణ ప్రభుత్వం ఆధార్ ప్రామాణీకరణను చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది.

ఆన్‌లైన్ టీడీఆర్ పోర్టల్‌కు సంబంధించి ఆస్తి యజమానులు, బిల్డర్లు , డెవలపర్ల నమోదు, పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడం , టీడీఆర్ దరఖాస్తులను సమర్పించడం , ఆ దరఖాస్తులను ఆస్తి డేటాబేస్‌తో అనుసంధానించడం వంటి అంశాలకు ఈ ఆధార్ ప్రామాణీకరణ ఉపయోగ పడుతుంది. అంతేకాకుండా, డీటీసీపీ, జీహెచ్ఎంసీ అధికారులు పరిపాలనా పరమైన పనుల కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను ఉపయోగించేటప్పుడు వారి గుర్తింపును ధృవీకరించు కోవడానికి కూడా ఇది తోడ్పడుతుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిన దాని ప్రకారం, ఈ ఆధార్ ప్రామాణీకరణ పూర్తిగా స్వచ్ఛందమైనది. ఆస్తి యజమానులు, బిల్డర్లు , డెవలపర్లు టీడీపీ సేవలకు సంబంధించి నమోదు చేసుకునేటప్పుడు, లాగిన్ అయ్యేటప్పుడు లేదా దరఖాస్తులు సమర్పించేటప్పుడు ఆధార్ ప్రామాణీకరణను స్వచ్ఛందంగా ఎంచుకోవచ్చు.

Leave A Reply

Your Email Id will not be published!