#Bathukamma : తెలంగాణకే తలమానికం బతుకమ్మ సంబురం

ఆడ‌బిడ్డ‌ల సంబురం బ‌తుక‌మ్మ ఉత్స‌వం

Bathukamma: ఎనలేని దోపిడీకి, తరతరాల వివక్ష నుండి విముక్తం పొందిన తెలంగాణ మాగాణం ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని నిటారుగా నిలబడ్డది. ఒకే గొంతుకై ఆడుతున్నది, పాడుతున్నది. కోట్లాది గొంతుకలు ఇప్పుడు బతుకంతా సంబురాలను జరుపుకునే అరుదైన సన్నివేశం బతుకమ్మ పండుగ కు ముస్తాబవుతోంది. పూల జాతరను తలపించేలా లక్షలాది ఆడబిడ్డలు యుద్దానికి సిద్ధమవుతున్నారు. బతుకమ్మ అన్నది కొందరికి మాత్రం అదో పండుగగా భావిస్తారు. కానీ అదో మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీక. ఇక బతుకమ్మ విషయానికి వస్తే, ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ(Bathukamma)ను తెలంగాణాలో సద్దుల పండుగ  అని కూడా పిలుస్తారు.

ఈ బతుకమ్మ దసరా పండుగకు రెండు రోజుల ముందు వస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించింది. సెప్టెంబరు, అక్టోబరు  నెలలలో రెండు పెద్ద పండుగలు జరుగుతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటు వైపు, ఇటు వైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయికలతో నిండి పోతుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ కాగా మరొకటి విజయ దశమి పండుగ. అయితే బతుకమ్మ పండుగ(Bathukamma) మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ ఆడబిడ్డలు బతుకమ్మ పాటలు పాడతారు.

బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ(Bathukamma)..ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు కేరాఫ్ ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగి పోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగి పోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలచుకొని తోటి మహిళలు ఆవేదన చెందేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే..కన్నీటి కథ ఇదే. ఈ పండుగ వర్షా కాలపు చివరలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి.

రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరు బయళ్లలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం  వాటి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజు బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు, గునుగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు.

ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెంలో వలయా కారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబూలంలో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది.  పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో, అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు.

సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చు కుంటారు.

చీకటి పడుతుంది అనగా, స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలు దేరుతారు. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత, మెల్లగా బతుకమ్మ పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జార విడుస్తారు. ఆ తరువాత మలీద అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచి పెడతారు. ఆ తరువాత బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కీలకమైన పాత్ర పోషించింది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు యెనలేని ప్రాధాన్యత పెరిగింది. 2016 అక్టోబర్ 8న హైదరాబాద్ లాల్‌బహుదూర్ స్టేడియంలో 20 అడుగుల ఎత్తయిన బతుకమ్మ చుట్టూ.. 9,292 మంది ఆడబిడ్డలు బతుకమ్మను ఆడారు. ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2018, అక్టోబర్ 19న ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమం జరిగింది. బతుకమ్మను పట్టుకొని పారా మోటారులో ఎక్కిన పలువురు మహిళలు ఆకాశంలో 5 నిముషాల పాటు విహరించారు. బతుకమ్మ తెలంగాణను దాటుకుని ప్రపంచాన్ని చుట్టేసింది.

No comment allowed please