Harbhajan Singh : భారత మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. గతంలో ఎన్నో విజయాలలో కీలక భాగస్వామిగా ఉన్న చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలపై ఇంకా కత్తి వేలాడుతూనే ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తన యూట్యూబ్ చానల్ ద్వారా సంచలన కామెంట్స్ చేశాడు. ఇప్పటికే భారత జట్టు సెంచూరీయన్ వేదికగా విజయం సాధించగా జోహెన్నస్ బర్గ్ వేదికగా సఫారీ టీం రెండో టెస్టు గెలుపొందింది.
ఈ తరుణంలో మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టు ఆడ లేక పోయిన విరాట్ కోహ్లీ తిరిగి రానున్నాడు. దీంతో మూడో టెస్టుకు సంబంధించి తుది భారత జట్టులో ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
హర్బజన్ సింగ్ పుజారా, రహానేలు ఫామ్ లోకి వచ్చినా ఇంకా వారి మెడపై కత్తి వేలాడుతూనే ఉందని హెచ్చరించాడు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉందన్నాడు భజ్జీ(Harbhajan Singh ).
అయితే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ఓ సూచన చేశాడు. పుజారా, రహానేలను మూడో టెస్టుకు తీసుకోవాలని సూచించాడు. రెండో టెస్టులో టీమిండియాకు మెరుగైన స్కోర్ ను జత చేయడంలో కీలకంగా ఆడారంటూ కితాబు ఇచ్చాడు హర్బజన్ సింగ్.
అజింక్యా రహానే 78 బంతుల్లో 58 పరుగులు చేశాడని, పుజారా కూడా ఫామ్ లోకి వచ్చాడని వారిద్దరినీ పరిగణలోకి తీసుకోవాలన్నాడు. యధావిధిగా కోహ్లీ స్థానంలోనే రహానేను ఆడించాలని సూచించాడు.
Also Read : స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత